అప్రమత్తంగా ఉండండి - చంద్రబాబు ఆదేశం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు - తడ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో, కోస్తా.. సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో, అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ఇప్పటికే వర్షాలు భారీగా కురుస్తున్న జిల్లాల్లో సహాయక చర్యల గురించి చంద్రబాబు ఆరా తీసారు.
ముఖ్యమంత్రి సమీక్ష
రాష్ట్రంలో భారీ వర్షాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాజ పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను ఇరిగేషన్ అధికారులు వివరించారు.

భారీ వర్షాలతో
ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరిక నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని వరికుంటపాడు మండలం, కనియంపాడులో పిల్లాపేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో, జిల్లా అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు.
ప్రభుత్వం అప్రమత్తం
అటు ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా వర్షం కొనసాగుతోంది. తిరుమలతో సహా చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులకు సమస్యలు లేకుండా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ఈ రోజు వరకు మూసి వేసారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇరిగేషన్ అధికారులు భారీ వర్షాల కారణంగా పెరుగుతున్న నీటి ప్రవాహాల గురించి ఆరా తీస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications