ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ .. అధికారులకు చంద్రబాబు అలెర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష
మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా వర్షాలు, వరదల పైన దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలను చేపడుతోంది. నిన్నటికి నిన్న హోం మంత్రి వంగలపూడి అనిత భారీ వర్షాలు నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించి తీసుకోవలసిన చర్యలను అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక తాజాగా భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

అధికారులకు వర్షాల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆకస్మికంగా కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాలలో కురుస్తున్న వర్షాలపైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వర్ష ప్రభావిత జిల్లాలలోని పరిస్థితులను నివేదించాలని సూచించారు.
ఆకస్మిక వరదలకు ఛాన్స్... అలెర్ట్ చేసిన సీఎం
నిన్నటి నుండి నెల్లూరు జిల్లాతో సహా పలు జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాల పైన అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు కొన్ని ప్రాంతాలలో 20 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది అని, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
నెల్లూరు జిల్లాలో వర్ష బీభత్సం.. ప్రమాదంలో పెన్నా బ్రిడ్జి
ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు, మండలాలలో భారీగా వరద నీరు చేరుతుంది .దీంతో వివిధ గ్రామాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరులో భారీ వర్షాల కారణంగా ప్రమాదంలో పెన్నా బ్రిడ్జి ప్రాంతం ఉంది.
జిల్లాలలో కంట్రోల్ రూమ్ లు
దీంతో అధికారులు పరిసర ప్రాంతాల వాసులను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరద సహాయక బృందాలను రంగంలోకి దింపారు.












Click it and Unblock the Notifications