ఏపీలో పోలీసు ఫిర్యాదుల నంబర్ ఏదీ? 100, 112 మధ్య గందరగోళం.?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచీ రాష్ట్రంలో పోలీసు ఫిర్యాదుల కోసం డయల్ 100 నంబర్ వాడటం అలవాటుగా మారిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే 100కు కాల్ చేయాలనేది అందరికీ ఓ బండగుర్తుగా ఉండిపోయింది. అయితే తాజాగా డయల్ 100 కు ఫిర్యాదు చేస్తుంటే కాల్ కలవడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన పోలీసు శాఖ ప్రత్యామ్నాయం సూచిస్తోంది. దీంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ, తెలంగాణ రెండు రాష్టాల్లోనూ డయల్ 100 సేవలు కొనసాగుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఉన్న వారు అయినా డయల్ 100కు కాల్ చేస్తే ఆయా రాష్ట్రాల డీజీపీ ఆఫీసుల్లో ఉండే కాల్ సెంటర్ కు కాల్ వెళ్తుంది. అక్కడి నుంచి క్షేత్రస్దాయిలో ఉండే పోలీసుల్ని అలర్ట్ చేస్తారు. అయితే తాజాగా ఇలా కాల్ చేస్తుంటే డయల్ 100కు కాల్ వెళ్లడం లేదనే ఫిర్యాదులు ఏపీలో వస్తున్నాయి. దీంతో పోలీసులు కేంద్ర ప్రభుత్వ నంబర్ 112 వాడాలని చెప్తున్నారు.

మరోవైపు ఏపీలో ఇప్పటివరకూ వాడుతున్న డయల్ 100ను తెలంగాణకు కేటాయించాలని, కాబట్టి ఇకపై ఏపీలో పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే డయల్ 112 మాత్రమే వాడాలనే సూచనలు కూడా పోలీసుల నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రెగ్యులర్ నంబర్ ఏదన్న దానిపై ఫిర్యాదుదారుల్లో గందరగోళం నెలకొంది. కేంద్రం ఏ రాష్ట్రంలో ఉన్న పౌరులైనా అత్యవసర పరిస్దితుల్లో ఉంటే పోలీసులను సంప్రదించేందుకు 112ను గతంలో అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇప్పుడు అదే దిక్కవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications