మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ కు తొలి విజయం, మూడో స్థానంలో వైసీపీ- ఆ నేత ఎఫెక్ట్..!!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు. తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు ఈ రోజు (శుక్రవారం) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ మరి కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. అక్కడి కాంగ్రెస్ నేత ఎఫెక్ట్ తోనే ఈ ఫలితం వచ్చింది. కాగా.. అక్కడ వైసీపీకి మూడో స్థానంకు పరిమితం కావటంతో ఆసక్తిగా మారింది.
చీరాల మున్సిపల్ ఓట్ల లెక్కింపు ఈ రోజు జరుగుతోంది. మురుసు తుఫాను కారణంగా ఈ నెల 3న జరగాల్సిన లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. చీరాల మున్సిపాలిటీలోని 44 వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 163 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ ఛైర్మన్ అభ్యర్దికి మెజార్టీ వచ్చింది. టీడీపీకి 40, వైసీపీకి 37, కాంగ్రెస్ కు 11 ఓట్లు పోలయ్యాయి. కాగా.. వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోరు కూటమి- వైసీపీ మధ్య ప్రతిష్ఠాత్మకంగా మారింది. కూటమి ఏకపక్షంగా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. కాగా.. ఇప్పుడు చీరాలలో కాంగ్రెస్ తొలి విజయం నమోదు చేసుకుంది.

చీరాలలో ఆమంచి ప్రభావం
చీరాల 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. ఈ 25వ వార్డులో బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో, వైసీపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. ఇక 22వ వార్డును టీడీపీ అభ్యర్థి కైవసం చేసుకోగా, అక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో, వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి.ఇక చీరాలలో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ పార్టీ కంటే ఆమంచి కృష్ణ మోహన్ ప్రభావం పని చేసింది. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఆమంచి కాంగ్రెస్ లో చేరారు. కాగా.. 2024 ఎన్నికల్లోనూ చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి 41,859ఓట్లు దక్కించుకున్నారు. మూడో స్థానంలో నిలిచారు. టీడీపీ నుంచి మాలకొండయ్య 72,700 ఓట్లు సాధించి 20,984 ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కరణం వెంకటేష్ కు 51,716 ఓట్లు దక్కాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ కు విజయం దక్కలేదు. చీరాలలో మాత్రమే దక్కటం వెనుక ఆమంచి ఎఫెక్ట్ గా విశ్లేషణలు మొదలయ్యాయి.













Click it and Unblock the Notifications
