ఒక్క ఛాన్స్ ప్లీజ్ ! టీడీపీ హైకమాండ్ కు ఎమ్మెల్యే కొలికపూడి కీలక విజ్ఢప్తి..!
ఏపీలో నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ కు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాలు తలనొప్పిగా మారాయి. రైతులు, మహిళలు, జర్నలిస్టులు.. ఇలా ఎవరినీ వదలకుండా కొలికపూడి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన్ను స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని అధిష్టానం కోరింది. దీంతో ఆయన ఇవాళ పార్టీ పెద్దల్ని కలిశారు.
అధినేత చంద్రబాబు ఆదేశాలతో పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, ఎంపీ కేశినేని చిన్ని సహా ఇతర నేతల్ని కొలికపూడి శ్రీనివాసరావు కలిశారు. తాజాగా తిరువూరులో చోటు చేసుకున్న వివాదాలపై వివరణ ఇచ్చారు. తనవైపు నుంచి ఉన్న తప్పిదాల్ని సరిచేసుకుంటానని విన్నవించారు. తన పనితీరు వల్ల క్యాడర్ లో సమన్వయం కొరవడిందని, సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కూడా తనదేనని స్పష్టం చేశారు.

తాజా వివాదాలపై నియోజకవర్గ కార్యకర్తలకు వివరణ ఇచ్చేందుకు ఆదివారం పార్టీ ప్రతినిధులతో కలిసి సభ ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే కొలికపూడి అధిష్టానం పెద్దలకు తెలిపారు. తన వల్ల తలెత్తిన ఇబ్బందుల్ని సరి చేసుకుంటానని విజ్ఞప్తి చేశారు. అందుకు అధిష్టానం కూడా సమ్మతించినట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం తిరువూరులో కార్యకర్తల భేటీలో కొలికపూడి ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే కార్యకర్తల భేటీ తర్వాత అయినా కొలికపూడి వివాదాలకు దూరంగా ఉంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications