ఆంధ్రా ఆగమాగం: ఒకేరోజు 97మంది మృతి - కొత్తగా 10,820 కేసులు - దేశంలోనే టాప్-2
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం కొనసాగుతున్నది. గడిచిన కొద్ది రోజులుగా ఏనాడూ 10 వేలకు తగ్గకుండా కొత్త కేసులు, రోజూ వందకు చేరువలో మరణాలు పరిపాటిగా మారింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,820 పాజిటివ్ కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.27 లక్షలకు, మృతుల సంఖ్య 2,036కు పెరిగింది. మొత్తం కేసుల పరంగా దేశంలోనే టాప్-3లో ఉన్న ఏపీ.. కొత్త కేసుల పరంగా మహారాష్ట్ర(12,822) తర్వాతి స్థానంలో నిలిచింది. కాగా, కొత్త కేసులతో పాటు ఆదివారం ఏపీలో రికవరీలు కూడా భారీగా ఉన్నాయి. ఒక్కరోజే 9,097 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఏపీలో కోరానా టెస్టులు విస్తృతంగా చేస్తుండటం కూడా కేసుల పెరుగుదలకు కారణమైంది. గడిచిన 24 గంటల్లో 62,912 శాంపిల్స్ ను టెస్టు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటిదాకా చేపట్టిన మొత్తం టెస్టుల సంఖ్య 24.87లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. ఏపీలో మొత్తం కేసులు 2.27లక్షలు కాగా, అందులో 13.87లక్షల మంది ఇప్పటికే కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 87,112గా ఉంది.
కేసులు, మరణాల పరంగా ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈస్ట్ గోదావరిలో కొత్తగా 1543 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. వెస్ట్ గోదావరిలో 1132 కొత్త కేసులు, 10 మరణాలు చోటుచేసుకున్నాయి. అనంతపురం(858కొత్త కేసులు, 8 మరణాలు), చిత్తూరు(848- 10), గుంటూరు (881 - 12), కడప (823 - 8), కృష్ణా(439 - 4), కర్నూలు (1399 - 7), నెల్లూరు (696 -4), ప్రకాశం (430 - 11), శ్రీకాకుళం(452 - 8), విశాఖపట్నం(961 - 6), విజయనగరం జిల్లాలో కొత్తగా 358 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే విజయవాడలోని కొవిడ్ ఫెసిలిటీ సెంటరైన స్వర్ణ పాలెస్ లో అగ్ని ప్రమాదం ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇప్పటివరకు 10 మంది చనిపోగా, ఆదివారం రాత్రి సమయానికి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ.. ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రం తరఫున మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.2లక్షలు, గాయపడినవాళ్లకు రూ.50వేల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. అంతకు ముందు ఏపీ ప్రభుత్వం కూడా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంపై విచారణ కొనసాగుతున్నదని పోలీస్, వైద్య శాఖలు తెలిపాయి.












Click it and Unblock the Notifications