బట్టలిప్పి ఏం చూస్తావ్ జగన్ ? అప్పుడు హోల్ సేల్, ఇప్పుడు రిటైల్ ! నారాయణ సెటైర్లు..!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తరచూ తనదైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే సీపీఐ సీనియర్ నేత నారాయణ ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. తాజాగా ఏపీ పోలీసుల్ని ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన నారాయణ.. ఆయనకు గతాన్ని గుర్తుచేశారు. అప్పట్లో అలా చేసి ఇప్పుడు ఇలా అంటారా అని జగన్ కు నారాయణ చురకలు అంటించారు. మధ్యలో చంద్రబాబు ఎపిసోడ్ నూ లాగారు.
జగన్ సీఎంగా ఉండగా ఆయన కింద 20, 30 వేల మంది పోలీసులు పనిచేశారని నారాయణ గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన విపక్షంలో ఉన్నా పోలీసులు మాత్రం వారే కదా అన్నారు. వాళ్లను బట్టలూడదీస్తాం అంటే ఎలా అని ప్రశ్నించారు. బట్టలూడదీస్తే ఏముంటదని, ఆయనకు ఏముంటుందో వాళ్లకూ అదే ఉంటుందిగా అన్నారు. కాబట్టి ఇలాంటి పొగరుబోతు మాటలు ఎందుకన్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్లు చప్రాసీల్లా పనిచేశారని, ఇప్పుడు వాచ్ మెన్లలా పనిచేస్తున్నారని, తేడా ఏముందన్నారు.

మీరు హోల్ సేల్ గా చేసింది, ఇప్పుడు వీళ్లు రిటైల్ గా చేస్తున్నారన్నారు. అప్పట్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఉన్న పోలీసులు ఇప్పుడు శిక్షలు అనుభవిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసుల సాయంతో నోటీసులు లేకుండా అరెస్టు చేశారని, పార్లమెంట్ సభ్యుడిని అరెస్టు చేసారని నారాయణ గుర్తుచేశారు. అధికారులు అన్నాక ఎవరేం చెప్పినా చేయాల్సిన పని లేదని, కార్యనిర్వాహక వ్యవస్ధ లేకుండా ప్రభుత్వాలు పనిచేయగలవా అని నారాయణ ప్రశ్నించారు.
ప్రభుత్వంలో ఉన్న వాళ్ల మాటలు విని అధికారులు తమ విధి నిర్వహణ మీరాల్సిన అవసరం లేదని, నిబంధనల మేరకు పనిచేస్తే సరిపోతుందని నారాయణ తెలిపారు. రాజకీయ నేతల మాటలు వింటే జైళ్లకు, అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తుందన్నారు. కాబట్టి అధికారులు న్యాయబద్ధంగా పనిచేసుకోవాలని నారాయణ సూచించారు.












Click it and Unblock the Notifications