టీడీపీ -జనసేన లౌకిక పార్టీలు కాదా : కేంద్రానికి ఏపీ ప్రభుత్వ తలొగ్గుతోంది - బీవీ రాఘవులు..!!
సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ ప్రజలను విడదీయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. ఆ ఎన్నికల్లో భాజపా చిత్తుగా ఓడిపోయిందని వివరించారు. అంతకు ముందు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మొక్కుబడిగా గెలిచిందన్నారు. దేశంలో మత కల్లోలాలను సృష్టించాలని చూస్తుందంటూ ఆరోపించారు.
హిందువులు పవిత్రంగా జరుపుకునే పండుగలను వేదికగా చేసుకుని సంఘ్ పరివార్ శక్తులు రెచ్చిపోతున్నాయంటూ రాఘవులు మండిపడ్డారు.

బీజేపీ వ్యతిరేక పోరాటం
బీజేపీ ..సంఘ్ పరివార్ శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలని తీర్మానం చేసామని చెప్పారు. ఏపీలో దురదృష్టవశాత్తు అన్ని పార్టీలు భాజపాకు వంత పాడుతున్నాయని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఏకంగా భాజపా తో కలిసి పని చేస్తుందని తప్పు బట్టారు. టీడీపీ..వైసీపీ..జనసేన లౌకిక పార్టీలా కాదా తేల్చుకోవాలని రాఘువలు సూచించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను విపరీతంగా పెంచిందని ధ్వజమెత్తారు. చెత్త పై పన్ను, ఆస్తి పన్ను పెంపు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపిందని విమర్శించారు.

కేంద్రం చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం
పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయం లో కేంద్రం రెండు ముక్కలు చేసి పావు వంతు మాత్రమే ఇస్తామని చెప్తుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి, కేంద్రం చెప్పినవన్నీ వైసీపీ ప్రభుత్వం చేస్తోందని రాఘవులు ఆరోపించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు,విద్యుత్ ప్లాంట్ల ప్రైవేటీకరణ వంటి వి కేంద్రం చెప్పినట్టు రాష్ట్రం చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం పార్టీ పోరాడాలని నిర్ణయించామని వెల్లడించారు.

రేషన్ బదులు నగదు వద్దు
ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు పంపిణీని వ్యతిరేకించాలి, ఇది చాలా ప్రమాదకరమైన అంశంగా పేర్కొన్నారు. రేషన్ బదులు నగదు పంపిణీ అంగీకార పత్రాలపై ప్రజలు సంతకాలు చేయొద్దని సూచించారు. భవిష్యత్తులో నగదు కూడా రాని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కోర్టులో సాక్ష్యాలు మాయమవడంపై రాష్ట్ర ప్రభుత్వం,కోర్టులు బాధ్యత తీసుకుని ఉన్నత స్థాయి విచారణ చేయించాలని కోరారు. హై కోర్టు సుమోటో గా తీసుకుని స్వీయ పర్యవేక్షణలో విచారణ చేయించాలని రాఘవులు డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications