సీమలో ఎంపీ సీట్ల పునర్విభజన కలిసొచ్చేదెవరికి- కొత్త ఫార్ములా.. కొత్త లెక్కలు..!?
డీలిమిటేషన్ పై కొత్త ఫార్ములా సిద్దమైంది. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బిల్లు వీగిపోవటంతో.. కొత్త లెక్కలతో మరోసారి బిల్లు ప్రతిపాదించేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటుగా డీలిమిటేషన్ సైతం పూర్తి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఏపీలో విశాఖతో పాటుగా రాయలసీమలోని పార్లమెంట్ స్ధానాల పునర్విభజన ఎవరికి కలిసి వస్తుందనే చర్చ రాజకీయంగా మొదలైంది. కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి.
కేంద్రం మరో సారి డీలిమిటేషన్ పైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి చేసిన సిఫారసుల పైన చర్చ సాగుతోంది. లోక్ సభ నియోజకవర్గాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 824కి పెంచాలని ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి సూచించినట్లుగా చెబుతున్నారు. ఈ కొత్త ఫార్ములా ప్రకారం ఏపీలో మొత్తం ఉన్న 25 ఎంపీ సీట్లలో విశాఖపట్నం, రాజంపేట, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గాలను ఒక్కొక్క దానినీ మూడు నియోజకవర్గాలుగా విభజించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అలాగే మచిలీపట్నాన్ని రెండుగా విభజించాలని కూడా మండలి ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక ఈ ఫార్ములా ప్రకారం కనుక సీట్లు పెరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 25 నుండి 38 కి చేరుకుంటాయి.

మారుతున్న లెక్కలు .. కలిసొచ్చేదెవరికి
ఈ కొత్త ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారనే ప్రచారానికి ముగింపు పలికే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. ఏపీలో ప్రధానంగా విశాఖతో పాటుగా రాయలసీమ జిల్లాల్లోని అయిదు లోక్ సభ స్థానాలను పునర్విభజన చేస్తూనే.. ఒక్కో స్థానం మూడుగా విభజన చేయటం ద్వారా రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. వైసీపీకి సీమ కంచుకోటగా ఉంది. 2024 ఎన్నికల్లో సీమలో కూటమి పార్టీలు ఏకపక్షంగా విజయం సాధించాయి. అయితే, ఇప్పుడు లెక్కలు మారుతున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ రాజంపేట, కడప, తిరుపతి స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు పునర్విభజన ద్వారా ప్రస్తుతం ఉన్న సీటు మూడుగా మారినా.. ప్రాంతం అదే కావటంతో తమకు నష్టం ఉండే అవకాశం లేదని వైసీపీ వాదిస్తోంది. అయితే.. కూటమి లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి. దీంతో.. ఈ ప్రతిపాదనలు 2029 ఎన్నికలకు కార్యరూపం దాల్చటం పైనా సందేహాలు నెలకున్నాయి. కాగా, ఈ ప్రతిపాదనలు మాత్రం ఏపీలో రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.













Click it and Unblock the Notifications