బాబుకు కొత్త షాక్: 'బాలకృష్ణకు సీఎం పదవివ్వాలి, కేసీఆర్ భాగస్వామి'
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ స్థానంలో బాలకృష్ణను కూర్చుండబెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ సోమవారం డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారిలో చంద్రబాబుకు కేసీఆర్ కూడా నాడు సహకరించారన్నారు. నాడు ఎన్టీఆర్‌ను దించేందుకు ఆడిన ఆటలో కేసీఆర్ కూడా భాగస్వామి అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాతీర్పుకు వెళ్లాలన్నారు.
చంద్రబాబు అడ్డంగా బుక్ అయ్యారన్నారు. ఆయన చరిత్ర ఎవరికీ తెలియంది కాదన్నారు. 1994లో ఆయన రాజకీయ చదరంగం ప్రారంభించాడని, దానినే ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. 20 ఏళ్ల తర్వాత ఆయన ఆడిన ఆటలకు, ఆయనకు దొరికిపోయారన్నారు.

1995లో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. దానిలో భాగస్వామ్యం నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఉందన్నారు. ఆ పాపంలో ఇద్దరికీ పాత్ర ఉందన్నారు. ఆ పాపం ఇప్పుడు బాబును పట్టుకుందన్నారు.
సూటుకేసు రాజకీయాలు ప్రారంభించిందే చంద్రబాబు అన్నారు. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే చంద్రబాబు వాటి పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. 1995 నుండి బాబు ఆడిన రాజకీయ చదరంగంలో ఆయనే చిక్కుకుపోయారన్నారు.
చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలన్నారు. అప్పుడే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మ శాంతిస్తుందని చెప్పారు.
కేసీఆర్‌పై హెచ్చార్సీలో కృష్ణయాదవ్ ఫిర్యాదు
ముఖ్యమంత్రి కేసీఆర్ పైన టీడీపీ హైదరాబాద్ నగర అధ్యక్షులు కృష్ణ యాదవ్ హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. 18లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications