Dharmana : వాలంటీర్లకు ధర్మాన సలహా- చంద్రబాబు కోసం ఆగద్దు- మీరే పేల్చేయండి..
ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లు కీలకంగా మారనున్నారనే అంచనాల మధ్య మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మిమ్మల్ని తీసేయకముందే మీరే ఆయన్ను తీసేయాలన్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించిన వాలంటీర్లు విపక్షాలను ఎంత ఇరిటేట్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. వైసీపీ అధికారంలో కొనసాగేందుకు వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వాలంటీర్లను వెనకేసుకొస్తున్న ఏపీ సర్కార్ లో కీలక రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా సతివాడలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన.. వాలంటీర్లకు కీలక సలహా ఇచ్చారు. వాలంటీర్లు ఊరికే భయపడకండి, ప్రభుత్వం ఏం చేస్తోందో, ఏ పార్టీ తప్పుచేస్తోందో వాలంటీర్లు చెబితే తప్పేంటని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. వాలంటీర్ కూడా ఓ పౌరుడేనన్నారు. మంచి ప్రభుత్వం కోసం ప్రచారం చేసే అవకాశం, మంచి కార్యక్రమం కోసం చెప్పే హక్కు వారికి ఉందన్నారు. వాలంటీర్లు ప్రతిపక్షాలకు భయపడొద్దని మంత్రి ధర్మాన తెలిపారు.

రాష్ట్రంలో ఓటర్లను వాలంటీర్లు మంచి డైరెక్షన్ లో తీసుకెళ్లాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వారికి సూచించారు. చంద్రబాబు వస్తే ముందు తుపాకీ పేల్చేది వాలంటీర్ పైనే అని ధర్మాన తెలిపారు. అంతవరకూ ఆగడం ఎందుకు ఆయన పేల్చేవరకూ ఆగకుండా మనమే తుపాకీ పేల్చేద్దాం అంటూ వాలంటీర్లకు ధర్మాన హితబోధ చేశారు. తద్వారా వాలంటీర్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చి మిమ్మల్ని తొలగించక ముందే మీరే ఆయన్ను అధికారంలోకి రానివ్వకుండా చూడాలని సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications