డిగ్గీ మాట: జగన్‌కు నష్టం, చంద్రబాబుకు అస్త్రం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తాయని అంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేతికి అస్త్రం అందించినట్లుగా కూడా అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ డిఎన్ఎ తమ పార్టీదేనని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. అంటే, జగన్ కాంగ్రెసుతోనే కలుస్తారని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది.
సమైక్యాంధ్ర కోసం ఢిల్లీ కోటను బద్దలు కొడుతానని చెబుతున్న వైయస్ జగన్‌కు అది నష్టం చేస్తుందని అంటున్నారు. జగన్‌ను గెలిపించినా కాంగ్రెసుతోనే కలిసిపోతారనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోతుంది. అందువల్ల కాంగ్రెసును వ్యతిరేకించే ప్రజలు వైయస్ జగన్‌ను బలపరిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో కాంగ్రెసు అధిష్టానం జగన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందనే విమర్శలకు ఊతం చేకూర్చినట్లయింది.

దత్తపుత్రుడి అండ చూసుకుని సొంత పార్టీకి చెందిన తమను పట్టించుకోవడం లేదని, తమ మాట వినిడం లేదని కాంగ్రెసు పార్టీకి చెందిన లగడపాటి రాజగోపాల్ వంటి సమైక్యవాదులు జగన్‌ను ఉద్దేశించి అంటున్నారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చినట్లు కూడా అవుతోంది. జగన్‌తో కాంగ్రెసు అధిష్టానం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని, జగన్ సాయంతో సీమాంధ్రలో తమ పార్టీని నాశనం చేయడానికి కాంగ్రెసు కుట్ర చేస్తోందని చంద్రబాబు చాలా కాలంగా విమర్సిస్తున్నారు.
కాంగ్రెసు అధిష్టానం కుట్రలో భాగంగానే అందరి కన్నా ముందుగా జగన్ పార్టీ సమైక్య నినాదాన్ని అందుకుందని ఆయన అన్నారు. సిడబ్ల్యుసి నిర్ణయం వెలువడకముందే ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలిసిందని చంద్రబాబు పలుమార్లు అన్నారు. అయితే, తాను కాంగ్రెసుతో కుమ్మక్కు కాలేదని చెప్పడానికి వైయస్ జగన్ సమైక్యాంధ్ర శంఖారావంలో సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం తీరును విభజన విషయంలో తప్పు పట్టారు.
జగన్‌ది తమ డిఎన్ఎనే అని గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. వ్యూహాత్మకంగానే దిగ్విజయ్ సింగ్ ఆ మాట అంటున్నారని చెబుతున్నారు. తమ పార్టీపై చంద్రబాబు ఎలాగూ విమర్శలు చేస్తారని, జగన్‌ను సీమాంధ్రలో తగ్గించడానికి చంద్రబాబు దృష్టిని అటుగా కూడా మళ్లిస్తే మంచిదని దిగ్విజయ్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications