నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది: రాజమౌళి
'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం ఆస్కార్ నామినేషన్ల బరిలో నిలిచింది. దీంతో దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం విదేశాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గతంలో తాను బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి స్పందించారు. తాను మాట్లాడిన మాటల వెనక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు.
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'బిల్లా' సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి మాట్లాడారు. 'ధూమ్ 2' సినిమా చూసి, ఆ సినిమాలో హృతిక్ రోషన్ ను చూసి ఆశ్చర్యపోయానని, కానీ ఇప్పుడు 'బిల్లా' సినిమా ట్రైలర్ చూశాక తనకు అర్థమైందని, ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా దీన్ని గురించి రాజమౌళి మాట్లాడారు.

15 సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందో తనకు తెలియదని, కానీ తాను ఒక విషయాన్ని అంగీకరిస్తానన్నారు. ఆ వీడియోలో తాను మాట్లాడిన పదాల ఎంపిక బాగాలేదని, హృతిక్‌ని కించపరచడం తన ఉద్దేశం కాదని, అతణ్ని చాలా గౌరవిస్తానన్నారు. ఈ మాటలు విన్న నెటిజన్లు రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పును అంగీకరించడంలోనే మీ గొప్పతనం ఉందని ఒకరు, మరోసారి మీ వినయాన్ని చూపించారంటూ మరొకరు.. ఇలా రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్ గ్లోబ్' అవార్డును 'ఆర్ఆర్‌ఆర్' సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగానికి 'నాటు నాటు' పాటకు పురస్కారం దక్కింది.












Click it and Unblock the Notifications