మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటమిపాలైన నాటి నుంచి మళ్లీ ప్రస్తుతం ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ కష్ట సమయాల్లో కూడా నోరుమెదపని మాజీ మంత్రి నారాయణ ఇప్పుడు ఎన్నికల్లో విజయం కోసం నానా అగుచాట్లు పడుతున్నారు. నారాయణ విద్యాసంస్థల అధినేత మాజీ మంత్రి నారాయణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో విజయం సాధించి తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నారు.
నెల్లూరు సిటీలో నారాయణ జాగ్రత్తలు
2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిన నారాయణ ఈసారి పక్కా ప్రణాళికతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. 2019లో అనిల్ కుమార్ యాదవ్ చేతిలో సుమారు మూడు వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైన నారాయణ గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో నారాయణ ఓటమికి కారణం ఇదే
ఇంతకాలం నెల్లూరు సిటీలోని ప్రజల వద్దకు వెళ్లకుండా రాజకీయాలకు దూరంగా ఉన్న నారాయణ ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగి హల్చల్ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో తన ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం చేసిన నారాయణ సొంత పార్టీ నేతలు, తన వాళ్లే తనకు వెన్నుపోటు పొడిచారని తెలుసుకొని ఈసారి జాగ్రత్త పడుతున్నారు.
వ్యక్తిగత సైన్యాన్ని రంగంలోకి దించిన నారాయణ
ఈ క్రమంలోని పార్టీలోని కీలక నేతలకు ,తన అనుచరులకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదని సమాచారం. అయితే నారాయణ తన విజయం కోసం తన విద్యా సంస్థలలో పనిచేసే వ్యక్తిగత సైన్యాన్ని రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. నారాయణ విద్యాసంస్థలలో పనిచేసే బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది నియోజకవర్గంలోని ఇంటింటికి తిరుగుతూ నారాయణ కోసం ప్రచారం చేస్తున్నారు.
ఇల్లిల్లూ తిరుగుతున్న నారాయణ గ్రూప్ విద్యాసంస్థల సిబ్బంది
తెలుగుదేశం పార్టీ అందించే సూపర్ సిక్స్ గురించి ఓటర్లకు వివరిస్తున్నారు. ఏరియాల వారీగా నారాయణ గ్రూప్ విద్యాసంస్థల సిబ్బందిని కేటాయించి వారి ద్వారా ప్రజల నాడి పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నారాయణ తమకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. పార్టీ లో అంతర్గతంగా చర్చిస్తున్నారు.
నారాయణ తీరుతో తెలుగు తమ్ముళ్ళ అసహనం
ఇంతకాలం పార్టీకి సంబంధించి ఎన్ని సమస్యలు వచ్చినా సైలెంట్ గా ఉన్న నారాయణ ఇప్పుడు ఎన్నికల్లో టికెట్టు రాగానే హడావిడి చేస్తున్నారని, దీంతో తెలుగు తమ్ముళ్ళు అసహనంలో ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా ఈసారి నెల్లూరు సిటీలో నారాయణ గెలవాలని చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేక మళ్ళీ సొంత పార్టీ నేతలే దెబ్బ కొడతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications