పవన్ టూర్ లో భద్రతా లోపం- డిప్యూటీ సీఎం చుట్టూ ఫేక్ ఐపీఎస్ చక్కర్లు-విచారణ..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పటికే పవన్ టూర్లలో భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తుండగా.. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఈ లోపం జరిగింది. పవన్ పర్యటన చేస్తున్న ప్రాంతంలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హల్ చల్ చేసినట్లు గుర్తించారు.
పవన్ పర్యటన నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావం ఉండే మన్యం ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రతే ఏర్పాటు చేశారు. అయితే పోలీసు యూనిఫామ్ లో ఐపీఎస్ గా వచ్చిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తి పవన్ టూర్ లోకి చొరబడి హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ చుట్టూ అతను తిరిగినట్లు గుర్తించారు. అతనికి కొందరు పోలీసులు సెల్యూట్ కొట్టి, ఫొటోలు కూడా దిగారు. పవన్ టూర్ ముగిశాక అతను విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పవన్ టూర్ లోకి ఆయన ఎందుకు వచ్చాడన్న దానిపై వారు ఆరా తీస్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటన సందర్భంగా ఐపీఎస్ యూనిఫామ్ లో నకిలీ పోలీసు ఆఫీసర్ కలకలం సృష్టించాడు. అదే జిల్లాలో తూనికలు కొలతలు శాఖలో పనిచేస్తున్న సూర్యప్రకాష్ పవన్ ను చూసేందుకు లేదా కలిసేందుకు ఈ టూర్ కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతనికి పోలీసు యూనిఫామ్ ఎక్కడ దొరికింది. పోలీసులు చెక్ చేయకుండా ఆయన్ను ఎలా అనుమతించారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిందితుడిని విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు.












Click it and Unblock the Notifications