ఎన్నికల్లో ఓడినా పర్లేదు.. కానీ తాడిపత్రిలో ఆ పని చేస్తానన్న జేసీ ప్రభాకర్ రెడ్డి!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిని ఫ్యాక్షన్ రహిత ప్రాంతంగా మారుస్తానని, అభివృద్ధిపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి అంటే ప్రభుత్వం ఇచ్చే నిధులతో మాత్రమే కాదని, సొంత ఆలోచనలతో నిధులు సమీకరించి ప్రాజెక్టులు చేపట్టడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు.
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి తన సొంత ప్రణాళికలతో నిధులు తెచ్చి రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా పరిషత్‌ను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోనే తాడిపత్రికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సెంటర్ రానుందని ప్రకటించారు. దేశంలో కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి సెంటర్లు ఉన్నాయని, తాడిపత్రికి ఇది పెద్ద గుర్తింపు అని అన్నారు.

యల్లనూరు జెడ్పీటీసీ స్థానానికి ఎంటెక్ చదువుతున్న యువతిని అభ్యర్థిగా నిలబెట్టానని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఓడిపోయినా పర్వాలేదని, తాడిపత్రిలో ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలంటే తనకు భయం లేదని, గతంలో తాను, కొడుకు, అన్న కూడా పోటీ చేసిన అనుభవం ఉందని చెప్పారు.గతంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో తనకూ బాధ్యత ఉందని, అనేక కుటుంబాలు నష్టపోయాయని, ప్రాణాలు కోల్పోయాయని గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు ప్రజలు మారిపోయారని, 2028 నాటికి రాజకీయ నాయకులను మెట్టుతో కొట్టే స్థాయికి వస్తారని చమత్కరించారు. రాబోయే ఎన్నికల్లో 'నోటా'కు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని కూడా అన్నారు. తాను, కేతిరెడ్డి పెద్దారెడ్డి రాళ్లు వేసుకుంటే ప్రజలు ఇద్దరి మీదా రాళ్లు వేస్తారని హాస్యంగా వ్యాఖ్యానించారు. తాడిపత్రి ప్రాంతంలో దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రభావం చూపాయి.
ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా గత తప్పులకు క్షమాపణలు కోరుతూ, శాంతి, అభివృద్ధి వైపు దృష్టి సారించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. పిల్లల చదువులు, కుటుంబ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications
