నోరు జారిన మాజీ మంత్రి-చంద్రబాబు పుట్టినరోజు బదులు జయంతి అన్న అఖిలప్రియ
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం సైలెంట్ అయిపోయారు. వైసీపీ సర్కార్ తనను టార్గెట్ చేయడంతో విమర్శలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే టీడీపీ తరఫున మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలని కోరే క్రమంలో ఆమె నోరు జారారు.
చంద్రబాబు పుట్టినరోజు కార్యక్రమాల్లో పార్టీ నేతలు పాల్గొనాలని కోరే క్రమంలో అఖిలప్రియ పొరబాటున జయంతిగా పేర్కొన్నారు. అయితే పక్కనే ఉన్నవారు కూడా పట్టించుకోకపోవడంతో దీన్ని అఖిలప్రియ కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత నేతలు ఆమెకు జరిగింది చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ఎవరూ అంత సీరియస్ గా మాత్రం తీసుకోనట్లు తెలుస్తోంది. గతంలో ఏపీలో పలువురు నేతలు ఇలాగే నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు టీడీపీ యువనేత లోకేష్ సైతం మంత్రిగా ఉండగా అంబేద్కర్ జయంతి బదులుగా వర్ధంతి అని పలికి విమర్శల పాలయ్యారు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రత్యర్ధి పార్టీలు సదరు వీడియోల్ని వైరల్ చేస్తుండటం జరుగుతోంది. ఇప్పుడు కూడా అఖిలప్రియ చంద్రబాబుపై నోరు జారిన వ్యాఖ్యల్ని వైసీపీ శ్రేణులు నెట్లో వైరల్ చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు మాజీ మంత్రి అయి కూడా ఇలా నోరు జారడమేంటని అఖిలప్రియపై మండిపడుతున్నారు. చంద్రబాబు పుట్టినరోజుకూ, జయంతికీ తేడా తేలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ వర్గాలు మాత్రం రాజకీయాల్లో ఇలాంటివి సహజమే అన్నట్లుగా కొట్టిపారేస్తున్నారు.












Click it and Unblock the Notifications