చిరంజీవికి పేర్ని ఘాటు కౌంటర్-గిల్లితే గిల్లుతారు..
ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి ఇవాళ వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ పలుమార్లు సీఎం వైఎస్ జగన్ ను ఇంటికెళ్లి మరీ భేటీ అయిన చిరంజీవి.. ఇప్పుడు రూటు మార్చి చేసిన వ్యాఖ్యలు సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. దీనిపై వైసీపీ మంత్రులు, నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వాల్తేర్ వీరయ్య 200 రోజులు ఆడడం సంతోషమని పేర్ని నాని తెలిపారు. తాను కూడా చిరంజీవి ఫాన్ నే అన్నారు. ఒకప్పుడు దండలు కూడా వేశానని గుర్తుచేసుకున్నారు. చిరు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి ఏపీ సచివాలయం ఎంత దూరమో ఇక్కడ నుంచి కూడా ఫిల్మ్ నగర్ అంతే దూరం అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పటి వరకు సినిమా హీరోలపై మాట్లాడిందా అని పేర్ని ప్రశ్నించారు.

ఓ మంత్రిపై కక్షతో సినిమాలో పాత్రలు పెట్టారని, మరి ఎదుర్కోక తప్పదంటూ చిరుకు పేర్ని హెచ్చరికలు పంపారు.గిల్లితే గిల్లించుకోవాలి అని సినిమా లో చెప్పినట్టు ఉండదన్నారు. బాహ్య ప్రంపంచంలో గిల్లినపుడు గిల్లుతారన్నారు. ఇది సినిమా కాదని చిరంజీవికి గుర్తుచేశారు. రెమ్యునరేషన్ గురించి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. సినిమా లో పాత్ర పెట్టారు కాబట్టి ఇలా కామెంట్స్ వస్తున్నాయని పేర్ని తెలిపారు.
చిరంజీవి రెమ్యునరేషన్ గురించి ఎవరైనా మాట్లాడారా అని పేర్నినాని ప్రశ్నించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ప్రత్యేక హోదా పై ఏం చేశారంటూ నిలదీశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతున్నారని ఆక్షేపించారు. మరోవైపు చంద్రబాబు అధికారంలో లేకపోతే తప్పుడు పెద్దరికం చూపిస్తాడని పేర్ని విమర్శించారు. పోలీసులపై దాడి చేయడానికి బాబు దగ్గర రాళ్లు ఎక్కడివి అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏపార్టీ అయినా సరే పోలీసులపై కుట్రలు,దాడులు చేసిన పార్టీలు ఉన్నాయా అని అడిగారు.
చంద్రబాబు దుర్మార్గపు కుట్రల వల్ల ఒక కానిస్టేబుల్ కళ్ళు పోయాయని పేర్ని విమర్శించారు. హైదరాబాద్ లో ఉండి రాష్ట్రం పై దుర్మార్గపు కుట్రలు చేస్తున్నారన్నారు. 1995 నుంచి రాయలసీమ కు నీళ్లు ఇవ్వకుండా ఏం పీకావని అడిగారు.పుంగనూరు బైపాస్ దగ్గర పోలీసులు తప్పితే ఇంకెవరూ లేరని, చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు అధికారం కోసం ఏదైనా చెప్తాడన్నారు. ఇంటికో ఉద్యోగం కాదు గదికో ఉద్యోగం ఇస్తా అంటాడని పేర్ని విమర్శించారు.












Click it and Unblock the Notifications