జగన్ కు నిధులు-చంద్రబాబుతో చర్చలు-బీజేపీ అసలు వ్యూహమిదే ?
ఏపీలో ఎన్నికల ఏడాది వచ్చేసింది. వచ్చే ఏడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈలోపు ముందస్తు ఎన్నికల ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాపకం కోసం రాష్ట్రంలో అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ, జనసేన కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఈసారి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.
గతంలో 2019 ఎన్నికల సమయంలో తమకు ప్రత్యర్ధిగా మారిన చంద్రబాబును టార్గెట్ చేసి, విపక్షంలో ఉన్న జగన్ కు సహకరించిన బీజేపీ నేతలు ఇప్పుడు 2024 ఎన్నికల విషయంలో మాత్రం విచిత్రమైన పరిస్ధితి ఎదుర్కొంటున్నారు. బీజేపీ లేకుండా ఏపీలో గెలుపు అసాధ్యంగా భావిస్తున్న వైసీపీ, టీడీపీలు రెండు కేంద్రానికి మద్దతుగా నిలుస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఓవైపు జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులిస్తూ, మరోవైపు చంద్రబాబుతో అమిత్ షా వంటి వారు రాజకీయ చర్చలు జరుపుతున్నారు.

ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే దానిపై ఇంకా స్పష్టమైన అంచనాలు లేవు. ప్రస్తుతానికి అయితే అధికార వైసీపీకి ఆధిక్యం కనిపిస్తున్నా.. టీడీపీ,జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం పరిస్ధితులు మారిపోతాయన్న అంచనాలు ఉన్నాయి. దీంతో అటు వైసీపీకి కానీ, ఇటు టీడీపీకి కానీ ఏకపక్షంగా మద్దతిచ్చేందుకు బీజేపీ సిద్ధపడటం లేదు. దీంతో అధికారంలో ఉన్న జగన్ కు నిధులిస్తూ, విపక్షంలో ఉన్న చంద్రబాబుతో రాజకీయ చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ ఎన్నికల తర్వాత పరిస్ధితుల ఆధారంగా కీలక నిర్ణయం తీసుకోవాలని కాషాయ నేతలు భావిస్తున్నారు.

ఈ నాలుగేళ్లలో తమకు నయానో, భయానో పూర్తిస్ధాయిలో అండదండలు అందిస్తున్న వైసీపీ, టీడీపీ ఇద్దరిలో ఏ ఒక్కరినీ ఏకపక్షంగా మద్దతివ్వడమో లేక దూరం చేసుకోవడమో చేసే పరిస్ధితి బీజేపీకి లేదు. అందుకే బీజేపీ శిబిరం సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని గెలిస్తే ఆ ఫార్ములా ఏపీలో రిపీట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అలా కాకుండా చంద్రబాబు విషయంలో ఎటూ తేల్చకపోతే ఆయన తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ను ఆశ్రయించే అవకాశాలున్నట్లు నివేదికలు అందుతున్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కోసం అమిత్ షా చర్చించారు. అదే సమయంలో జగన్ సర్కార్ కు ఆగ్రహం కలగకుండా నిధులు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications