వాహనదారులకు శుభవార్త.. ఇకపై రూ.20వేలకు బదులు కేవలం రూ.3వేలే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో వాహనదారులు ఇబ్బంది పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించింది. వాహనదారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం పాత వాహనాలపై విధించే గ్రీన్ టాక్స్ తగ్గింపు బిల్లుకు అసెంబ్లీ వేదికగా ఆమోదం తెలిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వాహనదారులకు శుభవార్త
ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సభలో ఈ గ్రీన్ టాక్స్ తగ్గింపు బిల్లును ప్రవేశపెట్టగా సభ దీనిని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వాహనదారులపైన ఆర్థికభారం గణనీయంగా తగ్గుతుంది. ఎన్నికలకు ముందు టిడిపి కూటమి వాహనదారులకు గ్రీన్ టాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేయడానికి మొదట ఆర్డినెన్స్ ద్వారా తగ్గింపు ఉత్తర్వులను జారీ చేసింది.

గ్రీన్ టాక్స్ కేవలం మూడు వేల రూపాయలే
ఇప్పుడు దానిని అసెంబ్లీలో చట్టబద్ధం చేసి ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు పాత వాహనాలకు గ్రీన్ టాక్స్ చాలా ఎక్కువగా ఉండేది. గరిష్టంగా లారీలు, బస్సులు వంటి పెద్ద వాహనాలకు 20వేల వరకు చెల్లించవలసి వచ్చేది. కొత్త బిల్లు ప్రకారం వాహనదారులు చెల్లించే గ్రీన్ టాక్స్ మొత్తం కేవలం మూడు వేల రూపాయలకు తగ్గించబడింది. దీంతో లక్షలాది మంది వాహనదారులకు బిగ్ రిలీఫ్ కలుగుతుంది.
గ్రీన్ ట్యాక్స్ ఇంతకుముందు గరిష్టంగా 20వేలు
సాధారణంగా లారీలు, బస్సులు వంటి పెద్ద వాహనాలకు ఏడు సంవత్సరాల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీనికోసం గ్రీన్ టాక్స్ చెల్లించాలి. వాహన రకము, దాని వయసును బట్టి గ్రీన్ టాక్స్ విధిస్తారు. కనిష్టంగా ఎనిమిది వందల రూపాయల నుంచి గరిష్టంగా 20 వేల రూపాయల వరకు ఈ టాక్స్ ఉండేది. ఈ పన్ను ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది.
ఎన్నికలకు ముందే చంద్రబాబుకు విజ్ఞప్తి
అయితే గ్రీన్ టాక్స్ ఎక్కువగా ఉందని చాలామంది వాహనదారులు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గ్రీన్ టాక్స్ అధికంగా ఉందని భారీ వాహనాల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గ్రీన్ టాక్స్ ఎక్కువగా ఉంది. ఇదే విషయాన్ని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల దృష్టికి తీసుకువెళ్ళారు.
గ్రీన్ టాక్స్ తగ్గిస్తామని హామీఇచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
చంద్రబాబు అధికారంలోకి వస్తే గ్రీన్ టాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పాత వాహనాలు యజమానులకు కాస్త ఊరట లభిస్తుంది. భారీ మొత్తాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రీన్ టాక్స్ 3000 రూపాయలతో మళ్లీ వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు.












Click it and Unblock the Notifications