కేరళను ముద్దాడనున్న నైరుతి.. తొలకరి పలకరింపుకు తెలుగురాష్ట్రాల తహతహ తీరేది అప్పుడే
నైరుతి రుతుపవనాలు నేడు కేరళను ముద్దాడనున్నాయి. నేడు కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, కొన్ని చోట్ల ఇప్పటికే వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలో మండుతున్న ఎండలు
ఇక ఏపీ లోను మరొక నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశం జరగనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరొకవైపు రెమాల్ తుఫాను తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పగటి ఉష్ణోగ్రతలతో పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

చల్లని కబురు చెప్పిన ఐఎండీ
అయితే ఎండల ప్రభావం ఎక్కువ రోజులు ఉండబోదని, నైరుతి రుతుపవనాలు త్వరలోనే ఏపీకి చల్లని వార్త తీసుకు రాబోతున్నాయని వాతావరణ శాఖ చెబుతున్న తీపి కబురు ఏపీ వాసులకు కాస్త ఉపశమనం కలిగిస్తుంది. నాలుగు రోజుల్లో ఏపీకి నైరుతి విస్తరిస్తుందని చెప్తున్నారు. ఇక నైరుతి రుతుపవనాలతో ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని చెబుతున్నారు
తెలంగాణాలోనూ భానుడి భగభగ
ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎండలు మళ్ళీ దంచి కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వేడి గాలుల తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
వారంలోగా తెలంగాణాకు రుతుపవనాలు
నేడు కేరళను రుతుపవనాలు తాకనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వారంలోగా రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. జూన్ మొదటి వారంలో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని మిగిలిన ప్రాంతాలలో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.
జూన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
జూన్ రెండో వారంలో తెలంగాణ రాష్ట్రం అంతటా సాధారణ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. జూన్ మూడో వారంలో మంచి వర్షాలు కురుస్తాయని, జూన్ చివరి వారం నాటికి రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications