ఏపీలో రాజధాని ఫైల్స్ కాక ! కొడాలి నాని పాత్రపై వైసీపీ అభ్యంతరం-హైకోర్టులో..
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ చిత్రాల హంగామా కొనసాగుతోంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ పై రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రంపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టువరకూ వెళ్లింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై రాజధాని ఫైల్స్ పేరుతో తీసిన చిత్రంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టుల పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఏపీలో అమరావతి స్ధానంలో వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ స్ధానిక రైతులు ఐదేళ్లుగా నిరసనలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ సినిమాల వరకూ వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం కావడం, మరోవైపు వ్యూహం చిత్రంతో వైసీపీ ముందుకొస్తున్న తరుణంలో రాజధాని ఫైల్స్ పేరుతో ఓ వెబ్ సైట్ యాజమాన్యం ఓ చిత్రాన్ని నిర్మించింది. దీన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ మేరకు గుంటూరు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని సహా మరికొన్ని పాత్రల్ని అనుచితంగా చిత్రీకరించారంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. కాబట్టి ఈ సినిమా విడుదల ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు..మధ్యంతర ఉత్తర్వులపై తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
మరోవైపు వ్యూహానికి పోటీగా రాజధాని ఫైల్స్ సినిమా కూడా విడుదలైతే ఎన్నికల వేళ కాక రేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్లను సైతం పార్టీల వారీగా విడదీసేస్తున్న క్రమంలో ఈ చిత్రాలు ఆ చిచ్చు మరింత రగిల్చేలా కనిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు ఇస్తున్న సర్ఠిఫికెట్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. వాటిపై తిరిగి రివ్యూ కమిటీ సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తుండటంతో ఆయా చిత్రాల్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలకు ఇబ్బందికర పరిస్ధితులు నెలకొంటున్నాయి.












Click it and Unblock the Notifications