మళ్లీ దంచుడే.. ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు !
ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా నివేదిక ప్రకారం, పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ పరిస్థితులు భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2వ తేదీ (మంగళవారం) నాటికి వాయువ్య బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడన వ్యవస్థ ఏర్పడే అవకాశముందని ప్రకటించింది.
ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు..
ఈ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వరుసగా 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తీరప్రాంత గ్రామాలు, తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. బలమైన గాలులు కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని చెబుతున్నారు. చెట్లు కూలిపోవడం వంటి ప్రమాదాలు ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఉపరితల ఆవర్తనం కారణంగా గాలుల్లో తేమ పెరగడంతో సముద్ర మట్టం దగ్గర వాతావరణ పీడనంలో మార్పులు వస్తాయని వివరిస్తున్నారు. సముద్ర అలలు సాధారణం కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏవైనా అపాయ సూచనలు వచ్చిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయాలు, రవాణా రంగాల కోసం ముందస్తు చర్యలు చేపట్టారు.
ప్రజల కోసం జాగ్రత్తలు..
- తీరప్రాంతం లోని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కఠిన ఆదేశాలు జారీ
- అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
- వర్షాల సమయంలో నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచన
- అత్యవసర సమయంలో ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి
- విద్యుత్ లైన్లు, చెట్లు విరిగే అవకాశమున్న ప్రాంతాల్లో నడవకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
వ్యవసాయంపై ప్రభావం..
ఈ వర్షాలు కొంతవరకు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయని, పంటలకు తగిన నీరు అందుతుందని వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే వర్షాల తీవ్రత పెరిగితే వరి, పప్పుధాన్యాలు, కూరగాయలు దెబ్బతినే అవకాశముందని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హౌరా, మేదినీపూర్.. అలాగే ఒడిశాలోని భువనేశ్వర్, పురీ, గంజాం, కటక్ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications