పవన్ కల్యాణ్ తమలో భాగమే..ఎందుకు ఆగ్రహంగా ఉన్నారో తెలుసు..హోంమంత్రి అనిత రియాక్షన్
రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా స్పందించారు. క్రిమినల్స్‌కు కులం, మతం అనేవి ఉండవని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలని ఫైరయ్యారు. సోమవారం పిఠాపురం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలకు పాల్పడిన కేసుల్లో నిందితుల్ని అరెస్ట్ చేయడంలో కులం అడ్డొస్తోందా ? నేరానికి పాల్పడిన వ్యక్తులను కులం చూసి వదిలేయాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. నిందితుల్లో తమ బంధువులున్నా సరే.. వాళ్లని మడతపెట్టి కొట్టాలన్నారు.
నేరం చేసిన వారు బయట తిరుగుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎస్పీలు, అధికారులు..రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.హోంమంత్రి అనిత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహించాలని సూచించారు. హోంశాఖ కూడా తానే తీసుకోవాల్సిందన్న పవన్.. తానే హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారని, అధికారంలో ఉన్నాం కాబట్టే సైలెంట్ గా ఉంటున్నామని, లేదంటే తామేంటో చూపించేవారమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమది ప్రతీకార ప్రభుత్వం కాదు.. అలాగని చేతకాని ప్రభుత్వం కూడా కాదన్నారు. తామెవ్వరినీ వెనకేసుకు రావడం లేదని, పోలీసులు, అధికారులు కూడా నిందితుల్ని వెనకేసుకు రాకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఏపీలో లా అండ్ అర్డర్ పరిస్థితి ఎలా ఉందో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను చూస్తేనే అర్థం అవుతోందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇటు కొందరు మంత్రులతో పాటు, కూటమి నేతలు సైతం పవన్‌కు చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. దీంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడ్డట్టు అయింది. తాజాగా పవన్ తనపై చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందించారు.
పవన్ కల్యాణ్ అన్న దాంట్లో తప్పేమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, నేను పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. తమలో పవన్ కల్యాణ్ కూడా భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన దానికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు. త్వరలోనే ఆయనతో మాట్లాడతా. పిఠాపురం సభలో మాట్లాడిన దానిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని నాకు తెలుసంటూ పవన్ తనపై చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications