Dasara 2026: శరన్నవరాత్రుల పూర్తి షెడ్యూల్.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసుకోండి!
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రం సమాయత్తమవుతోంది. కోట్లాదిమంది భక్తుల ఇష్టదైవం, కనకదుర్గమ్మ దసరా వైభవానికి సంబంధించిన దివ్యమైన అలంకారాల షెడ్యూల్‌ను ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం స్థానాచార్యులు, అధికారులు విడుదల చేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు, అంటే అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు మొత్తం 10 రోజుల పాటు దసరా మహోత్సవాలు అత్యంత కోలాహలంగా జరగనున్నాయి. ఈ పవిత్ర దినాలలో జగజ్జనని రోజుకో దివ్య రూపంలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

దేవీ దివ్య అలంకారాల వివరాలు:
- అక్టోబర్ 11 (ఆదివారం - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి): శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి
- అక్టోబర్ 12 (సోమవారం - ఆశ్వయుజ శుద్ధ విదియ): శ్రీ గాయత్రీ దేవి
- అక్టోబర్ 13 (మంగళవారం - ఆశ్వయుజ శుద్ధ తదియ): శ్రీ అన్నపూర్ణా దేవి
- అక్టోబర్ 14 (బుధవారం - ఆశ్వయుజ శుద్ధ చవితి): శ్రీ మహాచండీ దేవి
- అక్టోబర్ 15 (గురువారం - ఆశ్వయుజ శుద్ధ పంచమి): శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
- అక్టోబర్ 16 (శుక్రవారం - ఆశ్వయుజ శుద్ధ షష్ఠి / మూలానక్షత్రం): శ్రీ సరస్వతి దేవి
- అక్టోబర్ 17 (శనివారం - ఆశ్వయుజ శుద్ధ సప్తమి): శ్రీ మహాలక్ష్మీ దేవి
- అక్టోబర్ 18 (ఆదివారం - ఆశ్వయుజ శుద్ధ అష్టమి): శ్రీ దుర్గాదేవి
- అక్టోబర్ 19 (సోమవారం - ఆశ్వయుజ శుద్ధ నవమి): శ్రీ మహిషాసురమర్ధిని దేవి
- అక్టోబర్ 20 (మంగళవారం - ఆశ్వయుజ శుద్ధ దశమి / విజయదశమి): విజయదశమి నాడు శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి మహోజ్వల రూపంలో దర్శనమిస్తారు.
హంసవాహనంపై గంగమ్మ ఒడిలో తెప్పోత్సవం!
దసరా మహోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 20 విజయదశమి రోజున మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆ రోజు సాయంత్రం పవిత్ర కృష్ణానది జలాల్లో కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామివార్లు కన్నులపండువగా హంసవాహన తెప్పోత్సవం లో విహరించనున్నారు. ఈ ఆధ్యాత్మిక దృశ్యాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విజయవాడకు రానుండటంతో, ఆలయ పాలకమండలి, అధికారులు అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications