"రెడ్డిగారు'' ... నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా పేరు??
మైత్రీ మూవీస్ బ్యానర్‌లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రానికి "రెడ్డిగారు'' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. శ్రుతిహాసన్ కథానాయిక. కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. అఖండ తర్వాత తమన్ మరోసారి "రెడ్డిగారు'' సినిమాకు సంగీత దర్శకత్వం అందిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్నారు. ఈనెల 10వ తేదీన బాలకృష్ణ జన్మదినం సందర్భంగా సినిమా టీజర్‌తోపాటు టైటిల్‌నుకూడా విడుదల చేయబోతున్నారు.

ఏపీలో వేడివేడిగా రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలన్నీ వేడివేడిగా ఉన్నాయి. రాయలసీమలో బాలకృష్ణకు మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఇతర ఏ కథానాయకులకు లేనంత ఫాలోయింగ్ బాలకృష్ణకు అక్కడ ఉండటానికి కారణం సమరసింహారెడ్డి చిత్రం. నేరుగా ఒక కులానికి సంబంధించిన పేరుతో తీసిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది.
ఆ తర్వాత కూడా రెడ్డి పేరుతో పలు సినిమాలు, పలు పాత్రల్లో బాలకృష్ణ నటించారు. సినీ పరిశ్రమకు సంబంధించి ఒకరకంగా రెడ్డి కులస్తులు బాలకృష్ణను తమవాడుగా భావిస్తారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా బాలకృష్ణకు వీరాభిమాని అంటూ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లోని పాత చిత్రాలు సోషల్ మీడియాలో ఒకప్పుడు వైరల్ అయ్యాయి.

రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడం అత్యవసరం
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టం చాలా అవసరం. లేనిపక్షంలో పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి "రెడ్డిగారు'' అనే పేరు పెట్టడంవల్ల రాజకీయంగా ఉపయోగపడుతుందనేది బాలకృష్ణ భావన అయివుండొచ్చంటున్నారు సినీ, రాజకీయ విశ్లేషకులు. ఆ సామాజిక వర్గం నుంచి ఈసారి ఎన్నికలకు కొన్ని ఓట్లను చీల్చగలిగినా తెలుగుదేశం పార్టీ గట్టెక్కుతుందనేది టీడీపీ వర్గాల భావనగా ఉంది.

బాలకృష్ణను తమవాడుగా భావిస్తున్న రెడ్డి సామాజికవర్గం
బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే హిందూపురం నియోజకవర్గం రాయలసీమలోనే ఉంది. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారి ప్రాబల్యం ఎక్కువగా ఉండే రాయలసీమలో బాలకృష్ణ అంటే ప్రాణాలిచ్చేవారు చాలామంది ఉన్నారు. అంతటి అభిమానాన్ని ఈసారి ఓట్ల రూపంలోకి మార్చాలనే నిర్ణయంతో బాలకృష్ణ ఈ టైటిల్‌వైపు మొగ్గుచూపి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్నగారు, వీరసింహారెడ్డి అనే మరో రెండు టైటిళ్లను పరిశీలించినప్పటికీ "రెడ్డిగారు'' అనే టైటిల్ వైపే బాలకృష్ణ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. పేరుకు తగ్గట్లుగానే బాలకృష్ణ చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనపడబోతున్నారని, ఆ పాత్రను దర్శకుడు గోపీచంద్ చాలా శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications