చేతులారా పోగొట్టుకున్న పవన్..: ఐవైఆర్ విశ్లేషణ
TDP Jana Sena alliance: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.
ఇందులో భాగంగా రెండు విడతల్లో 35 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన నియోజకవర్గాల కూర్పుపై కసరత్తు చేస్తోంది. సంక్రాంతి పండగ నాటికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పూర్తి జాబితా వెలువడుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం.
ఈ పరిణామాలపై ఏపీ బీజేపీ సీనియర్ నేత, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం మంచి పరిణామం కాదని, ఓ ప్రత్యమ్నాయ శక్తిగా ఎదిగే సువర్ణావకాశాన్ని పవన్ కల్యాణ్ చేజేతులారా పోగొట్టుకున్నట్టయిందని అన్నారు.
వైఎస్ఆర్సీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో మూడో పార్టీ బలంగా ఎదగడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని, ప్రజలు మార్పును కోరుకుంటోన్నారని అన్నారు. జనసేనను మూడో ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా ప్రజలు ఆదరంచి ఉండే వారని విశ్లేషించారు. టీడీపీతో సంబంధం లేకుండా జనసేన పోటీ చేసి ఉంటే రాష్ట్రంలో ఖచ్చితంగా హంగ్ అసెంబ్లీ వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు.
హంగ్ అసెంబ్లీ వచ్చి ఉంటే పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అయి ఉండేవారని ఐవైఆర్ పేర్కొన్నారు. మూడో ప్రత్యామ్నాయ లోటును భర్తీ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోన్నప్పటికీ.. అనేక కారణాల వల్ల అది సాధ్యపడట్లేదని తేల్చి చెప్పారు. ఏపీ బీజేపీకి సరైన నాయకత్వం ఉండట్లేదని అన్నారు.
తెలుగుదేశం పెట్టిన పొత్తు ప్రతిపాదనలను పవన్ కల్యాణ్ వెనుకా ముందూ ఆలోచించకుండా అంగీకరించడం సరికాదని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. సీట్ల వద్ద బేరసారాలు ఆడే అవకాశం సైతం ఇప్పుడు పవన్‌కు లేకుండా పోయిందని చెప్పారు. ముందే కాడె పడేసి, యువగళం వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల తన విలువను తానే తగ్గించుకున్నట్టయిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications