మంత్రులపై పవన్ కల్యాణ్ ఫొటో ఫీచర్.. మరోసారి రాజుకున్న నిప్పు
వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేనాని దూకుడును ఉధృతం చేశారు. ఆ పార్టీ నేతలకు, మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ పలువురు మంత్రుల్ని ఉద్దేశిస్తూ ప్రశ్నలు సంధించారు. ''మీకు కేటాయించిన శాఖలకు న్యాయం చేస్తారా? లేదంటే చౌకబారు విమర్శలతోనే పదవీ కాలమంతా వెళ్లదీస్తారా?'' అంటూ జనసేన నిలదీసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, రోజా, విడుదల రజనీ, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజాలను ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలను సంధించారు.

ఏపీ అప్పుల చిట్టా ఎంతో లెక్క చెబుతారా? ఒక్కో పౌరుడిపై ఎంత భారం మోపారో ప్రజలకు వివరణ ఇవ్వగలరా అంటూ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని పవన్ కల్యాణ్ నిలదీస్తున్నట్లుగా చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలోనే ముఖ్యమంత్రి జగన్ ఫొటోను కూడా ఉంచారు.

కొండలు, చెరువుల్లో కాకుండా నివాసయోగ్యమైన భూముల్లో నాణ్యమైన ఇళ్లు ఎన్ని కట్టించారో చూపగలవా జోగి? అంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇందులో పవన్ చెప్పు పట్టుకున్న చిత్రాన్ని ఉంచారు.

పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించగలరా బొత్స? అంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో పవన్ నిలదీస్తున్నట్లుగా ఉన్నారు.

నీ రికార్డింగ్ డాన్సులు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయాల్లో నువ్వు కష్టపడి తీసుకొచ్చిన పరిశ్రమల గురించి శ్వేతపత్రం విడుదల చేయగలవా గుడివాడ? అంటూ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో పవన్ కల్యాణ్ చెప్పు పట్టుకున్న చిత్రం ఉంది.

పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఇప్పటివరకు నువ్వు చేసిన బృహత్ కార్యాలేంటో ఏపీ ప్రజలకు సూటిగా చెప్పగల సత్తా ఉందా మహానటి రోజా? అంటూ పర్యాటశాఖ మంత్రి రోజా చిత్రాన్ని ఉంచారు. ఇందులో పవన్ నిలదీస్తున్న ఫొటో ఉంది.

ఇంకెంతమందిని మీ గుంతల రోడ్లు బలితీసుకుంటే మొద్దు నిద్ర వీడతారో తెలపగలవా దాడిశెట్టి? అంటూ రహదారులశాఖ మంత్రి దాడిశెట్టి రాజా చిత్రాన్ని ఉంచారు. ఇందులో పవన్ చెప్పు పట్టుకున్న ఫొటో ఉంచారు.

మీ సహచర మంత్రులు అనారోగ్యానికి పక్క రాష్ట్రాలకు పారిపోకుండా ఏపీలోనే వైద్యం చేయించుకునే స్థాయి సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారు పబ్లిసిటీ క్వీన్ విడదల రజినీ? అంటూ ఆరోగ్యశాఖ మంత్రి రజినీ చిత్రాన్ని ఉంచారు. ఇందులో పవన్ నిలదీస్తున్న ఫొటో ఉంది.












Click it and Unblock the Notifications