కొడుకు పుట్టినరోజున స్టెప్పులేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి; సెటైర్లు వేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి!!
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రూటే సపరేటు. ఆయన ఏది చేసినా సంచలనమే. ప్రభుత్వంపై తన నిరసన గళాన్ని వినిపించినా, స్థానిక నాయకులపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా తనకంటూ ఓ స్టైల్ తో ఆయన అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన పంథానే వేరు.
అటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా కార్యకర్తలతో కలిసి డాన్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వయసు మీద పడ్డప్పటికీ ఆయనలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు అని తాజాగా మరోమారు నిరూపించారు. ఆయన కుమారుడు జేసీ అశ్విత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలతో కార్యకర్తలతో సరదాగా చిందులేశారు.

73 ఏళ్ల వయసులో కూడా 18 ఏళ్ల కుర్రాడిలా స్టెప్పులేస్తూ డ్యాన్సులు చేశారు. పల్సర్ బైక్ సాంగ్ కి డాన్స్ చేసిన జేసీ కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పార్టీ నాయకులతో కలిసి సంతోషంగా గడిపారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి డాన్స్ చెయ్యటం ఇప్పుడేమీ కొత్త కాదు. గతంలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి అనేక సందర్భాల్లో వేదికలపైన కూడా స్టెప్పులేశారు. వివిధ పార్టీ కార్యక్రమాలలో ఆయన డాన్సులు అందర్నీ ఆకట్టుకునేవి.
అయితే ఏ మాత్రం అవకాశం దొరికినా జేసీ ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేసే వైసీపీ నేతలు తాజాగా అస్మిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన డాన్సును కూడా టార్గెట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 73 ఏళ్ల వయసులో జేసీకి డాన్స్ అవసరమా అంటూ ఎద్దేవా చేశారు.
ఒకప్పుడు తాడిపత్రిలో రౌడీయిజం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు డ్యాన్సులు చేసుకునే పరిస్థితికి దిగజారారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరి ఇంట్లోనైనా బర్త్ డే పార్టీ ఉంటే పిలిస్తే వచ్చి డాన్స్ చేస్తా అన్నట్టు జెసి ప్రభాకర్ రెడ్డి తీరు ఉందని కేతిరెడ్డి పెద్దారెడ్డి సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications