చంద్రబాబు విషయంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఒకేమాటమీద!
ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుణ్ని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయ యవనికపై టీడీపీ-జనసేన పొత్తు పొడించింది. మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి నాయకులు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. కక్షపూరితంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు.
ఇటువంటి తరుణంలో చంద్రబాబు తీసుకొచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ వల్ల లబ్ధిపొంది ఉద్యోగాలు చేస్తున్నవారు.. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విదేశాల్లో కూడా ఉన్నారు. వారంతా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబుకు మద్దతు తెలియజేస్తున్నారు. రాజకీయ వర్గాలు, వ్యాపార వర్గాలతోపాటు సినిమా పరిశ్రమ నుంచి కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ తోపాటు మరికొందరు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు.

ఇంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం పెదవి విప్పడంలేదు. అసలేమైంది.. వీరిద్దరూ ఎందుకు ఖండించడంలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుణ్ని అడిగితే ఆ విషయాన్ని తారక్ నే అడిగి తెలుసుకోమన్నారు. నందమూరి కుటుంబం నుంచి అందరూ నిరసనల్లో పాల్గొనడంతోపాటు చంద్రబాబు కుటుంబం దగ్గరే ఉంటూ వారికి ధైర్యం చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం మౌనం వహించారు. కొన్నాళ్లుగా అన్నదమ్ములిద్దరూ ఒకే మాట మీద ఉంటున్నారు. హరికృష్ణ మరణం వీరి మధ్య బంధాన్ని బలోపేతం చేసింది. కల్యాణ్ రామ్ కు ఉన్న ఆర్థిక సమస్యలకు జూనియర్ ఎన్టీఆర్ పరిష్కారం చూపించడంతోపాటు తాజాగా నటించే దేవర చిత్రానికి కూడా నిర్మాతగా భాగస్వామిని చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గీసిన గీటును కల్యాణ్ రామ్ దాటడంలేదని, వారిద్దరూ ఒకే మాటమీద ఉంటున్నారని, ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా కలిసే చేస్తున్నారని సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది.
అలాగే చంద్రబాబు అరెస్ట్ విషయంలో కూడా స్పందించే అవకాశం లేదని, దీనికి పలు కారణాలున్నాయంటున్నారు. ప్రత్యక్షంగా మద్దతు తెలియజేయకపోయినా పరోక్షంగా అయినా తెలియజేయవచ్చు. తారక్, కల్యాణ్ రామ్ విషయంలో ఇది కూడా జరగలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. మరికొద్దిరోజులు గడిస్తేకానీ తెలుగుదేశం పార్టీ పట్ల ఈ అన్నదమ్ముల వైఖరి పూర్తిగా అవగతమవుతుందని, అప్పటివరకు వేచి చూడటమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications