చిన్న రాయితో కొడితే హత్యాయత్నం అవుతుందా?
YS Sharmila: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తోన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజాగళం పేరుతో రోడ్ షోలను చేపట్టారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.
అటు పోలింగ్ గడువు సమీపిస్తోంది. నోటిఫికేషన్ సైతం వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వాటిని దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 25. 26వ తేదీన వాటిని స్క్రూటినీ చేస్తారు.

నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది.
కాగా- ఈ నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఈ ఉదయం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ ఉదయం సరిగ్గా 11:30 గంటలకు రిటర్నింగ్ అధికారికి వాటిని అందజేశారు. ఆ సమయంలో ఆమె వెంట వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, పార్టీ సీనియర్ నాయకుడు తులసీరెడ్డి ఉన్నారు.
నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు ఆమె ఇడుపులపాయకు వెళ్లారు. వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించారు. నామినేషన్ పత్రాలను తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిపై ఉంచి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.
వైఎస్ షర్మిల అడుగుపెట్టడంతో కడప లోక్‌సభ పరిధిలో ముక్కోణపు పోటీ నెలకొన్నట్టయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున చదపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీలోనిలిచారు.

అనంతరం షర్మిల మాట్లాడారు. కడప జిల్లా ఓటర్లు ఇంకా వైఎస్ఆర్, వివేకానందరెడ్డిని మరిచిపోలేదని గుర్తు చేశారు. ఇక్కడి ఓటర్లు న్యాయం వైపు ఉన్నారా? లేక నేరం వైపు ఉన్నారా అనేది ఈ ఎన్నికల్లో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. చిన్న రాయితో హత్య చేయడానికి ప్రయత్నించారని అధికార పార్టీ చెబుతోంది.. చిన్న రాయితో కొడితేనే హత్యాయత్నమే అయితే వివేకానందరెడ్డిని నరకడాన్ని ఏమంటారని ఆమె ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications