లారీ, టిప్పర్ డ్రైవర్లకు జగన్ గుడ్ న్యూస్
YS Jagan Bus Yatra: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తోన్నారు. కడపలో ఈ యాత్రను ప్రారంభించిన జగన్.. నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల మీదుగా నెల్లూరుకు చేరుకున్నారు.
ఈ బస్సు యాత్రం నేటికి ఎనిమిదో రోజును పూర్తి చేసుకుంది. నేడు బస్సుయాత్రకు విరామం ఇచ్చారు. ఈ ఎనిమిది జిల్లాల్లో బస్సు యాత్రలు, బహిరంగ సభలకు వచ్చిన ప్రజాదరణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు వైఎస్ జగన్. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

నెల్లూరు జిల్లాలో లారీ, టిప్పర్, ఆటో డ్రైవర్లతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకు శింగనమల టికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఓ సాధారణ టిప్పర్ డ్రైవర్‌ను కూడా చట్టసభలో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.
వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించినప్పటి నుంచి వీరాంజనేయులు పార్టీకి కార్యకర్తగా ఉంటోన్నాడని, ఎంఏ ఎకనామిక్స్, బీఈడీ పూర్తి చేసి చంద్రబాబు హయాంలో ఉద్యోగం దొరక్కపోవడంతో తన కాళ్ల మీద తాను నిలబడటానికి టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తోన్నాడని వివరించారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు టిప్పర్ డ్రైవర్‌కు అసెంబ్లీ టికెట్ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారని గుర్తు చేశారు.
జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇచ్చాడు అంటూ చంద్రబాబు అవహేళన చేశాడని, ఆయనను వేలి ముద్రగాడు అని కూడా కించపరిచారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు పెత్తందార్లు- పేదల మధ్య జరిగే యుద్ధంగా తాను గతంలోనే అభివర్ణించానని, దాన్ని చంద్రబాబు చేతల్లో చూపాడని జగన్ అన్నారు.

ఈ ఎన్నికల తరువాత వరుసగా రెండోసారి ఏర్పడబోయే తమ ప్రభుత్వంలో సొంత టిప్పర్లు, లారీలు ఉన్న డ్రైవర్లకు కూడా వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేస్తామని జగన్ ప్రకటించారు. ఈ అయిదేళ్ల పాలనలో వాహన మిత్ర ద్వారా సొంత ట్యాక్సీ, ఆటో కొనుక్కుని తన జీవనం సాగిస్తున్న సొంతంగా చేసుకుంటున్న వారికి 1,296 కోట్ల రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు గుర్తుచేశారు.
మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన తరువా సొంతంగా టిప్పర్లు, లారీలు ఉన్న డ్రైవర్లను కూడా వాహనమిత్ర పథకం పరిధిలోకి తీసుకుని వస్తామని అన్నారు. మళ్లీ తమ ప్రభుత్వమే రాబోతోందని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications