గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!
గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నా.. పంపిణీలో మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి. గ్యాస్ బుకింగ్ కు కంపెనీలు విధించిన గడువు సమస్య గా మారింది. అదే సమయంలో పంపిణీ కి ఏజెన్సీలు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. దీంతో .. ఈ కష్టాలకు చెక్ పెట్టే విధంగా కొత్తగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు 5 కిలోల వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి తెచ్చాయి. వీటిని పొందే విధి విధానాలను సులభతరం చేసాయి. నేరుగా పొందే అవకాశం కల్పిస్తున్నాయి.
గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగిన క్రమంలో కంపెనీలు 5 కిలోల వంట గ్యాస్ సిలిండర్లను మార్కెట్ లోకి అందుబాటులోకి తెచ్చాయి. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్ కంపెనీలన్నీ ఈ చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశ పెట్టాయి. ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే అడ్రస్ ఫ్రూఫ్ అవసరమయ్యేది. అలాగే అప్లికేషన్ ఫారంలు పూర్తి చేయాల్సి వచ్చేది. అయితే 5 కిలోల గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరమే లేదు. కేవలం ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. మీ సమీపంలోని ఏ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి అయినా అప్పటికప్పుడు దీనిని తీసుకుని వెళ్లవచ్చు. గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌కు ముందే బుక్ చేసుకుంటే ఇంటికి రావడానికి సమయం పడుతుంది. అదే ఈ చిన్న సిలిండర్‌ను మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి లేదా సమీపంలోని దుకాణాల్లో సులువుగా రీఫిల్లింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

సలభంగా పొందే విధంగా వెసులుబాటు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛోటు పేరుతో 5 కేజీల సిలిండర్ లాంచ్ చేసింది. పెట్రెల్ పంపుల్, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఇండేన్ పంపిణీదారుల వద్ద దీనిని కొనుగోలు చేయవచ్చు. ఏ నగరంలో అయినా దీనిని వినియోగించుకోవచ్చు. ఇక భారత్ గ్యాస్ మినీ సిలిండర్ అయితే మీ ఇంటి వద్దకే వచ్చేస్తుంది. 1800224344 నెంబర్‌కు కాల్ చేస్తే రెండు గంటల్లోనే మీ ఇంటికి డెలివరీ చేస్తారు . అయితే రూ.25 డెలివరీ ఛార్జీ కట్టాల్సి ఉంటుంది. గ్యాస్ అయిపోయినప్పుడు పాత ఖాళీ సిలిండర్‌ను ఇచ్చి, భర్తీ చేసిన కొత్త సిలిండర్‌ను వెంటనే తీసుకోవచ్చు. దీనివల్ల డెలివరీ బాయ్ ఎప్పుడు వస్తాడా అని గంటల తరబడి వేచి ఉండాల్సిన పని లేదు. దీనికోసం మీరు ఏ ఒక్క ఏజెన్సీకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఒకచోట కొని, మరోచోట రీఫిల్ చేయించుకోవచ్చు. గుర్తింపు పొందిన అవుట్‌లెట్లలో కూడా లభిస్తాయి. ఇప్పుడు గ్యాస్ సమస్యల వేళ వీటికి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications