వైసీపీలో కొత్త టెన్షన్ - మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా : ఛాన్స్ దక్కేనా..!!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు కేబినెట్ విస్తరణ కొత్త సమస్యలకు కారణం అవుతోంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతల అనుచరులు అల్టిమేటం ఇస్తున్నారు. ఇంకా మంత్రుల జాబితా అధికారికంగా బయటకు రాకముందే..మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి కోసం మాచర్ల మున్సిపల్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న కౌన్సిలర్లు పిన్నెల్లికి మంత్రిపదవి ఇవ్వకుంటే...తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు.

మంత్రి పదవి డిమాండ్ చేస్తూ..
గుంటూరు జిల్లా నుంచి 2019 ఎన్నికల్లో మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలుపొందారు. 2019లో ఏర్పాటు చేసిన తొలి కేబినెట్ లో మోపిదేవి వెంకటరమణ..మేకతోటి సుచరిత కు అవకాశం దక్కింది. అయితే, మోపిదేవి రాజ్యసభకు వెళ్లటంతో..అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాకు సుచరిత ఒక్కరే మంత్రిగా ఉన్నారు. దీంతో..ఈ సారి విస్తరణలో తొలి నుంచి జగన్ తో కలిసి అడుగులు వేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లికి మంత్రిపదవి ఖాయమని అనుచరులు అంచనా వేస్తున్నారు.

సామాజిక సమీకరణాలే కీలకంగా
కానీ, సీఎం దగ్గర జరుతున్న కసతర్తు..బయటకు వస్తున్న పేర్లలో పిన్నెళ్లి పేరు లేదని తెలుస్తోంది. దీంతో..ఆయన అనుచరులు అల్టిమేట్ జారీ చేసారు. స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో ఏకపక్షంగా వైసీపీ విజయం సాధించింది. పిన్నెళ్లి ప్రస్తుతం విప్ పదవిలో కొనసాగుతున్నారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో పిన్నెళ్లికి మంత్రి పదవి సాధ్యపడదని చెబుతున్నట్లు సమాచారం. ఇదే జిల్లా నుంచి అంబటి రాంబాబు.. ఆళ్ల రామక్రిష్ణారెడ్డి.. కోన రఘుపతి.. బ్రహ్మనాయుడు మంత్రి పదవుల కోసం రేసులో ఉన్నారు.

సీఎం తుది కసరత్తు..సాయంత్రం ఫైనల్
అయితే, జిల్లా నుంచి ఒక ఎస్సీ.. మరకొటి బీసీలకు కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..పిన్నెళ్లి మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేర్పులతో జాబితా సిద్దం చేస్తున్నారు. ఈ రాత్రికి గవర్నర్ వద్దకు ప్రభుత్వం నుంచి అధికారికంగా మంత్రుల జాబితా వెళ్లనుంది. దీంతో..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిని బుజ్జగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications