ఇదంతా అవసరమా? - మెగాస్టార్ చిరంజీవి సంచలనం
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి.. మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పైనా తన మనసులో మాటను వెల్లడించారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడంపైనా స్పందించారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగడానికి అవసరమైన శక్తియుక్తుల గురించి చిరంజీవి తన ప్రసంగంలో ప్రస్తావించారు. అవి లేవని తేల్చి చెప్పారు.

అప్పట్లో గాడ్‌ఫాదర్ ఈవెంట్‌లో..
చిరంజీవి.. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడటం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ఇదివరకు తాను నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల సమయంలో వాటిని ప్రస్తావించారు. పవన్ కల్యాణ్‌కు బాహటంగా మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ నిజాయితీగా ఉంటాడని, ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తాడని ప్రశంసించారు. తన తమ్ముడి నిజాయితీ, నిబద్ధత తనకు చిన్నప్పటి నుంచీ తెలుసని, అలాంటి నాయకుడే రాష్ట్రానికి కావాలని వ్యాఖ్యానించారు.

పవన్‌పైనే..
పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి చెప్పారు. తాను భవిష్యత్తులో జనసేనకు మద్దతు ఇస్తానో.. లేదో తెలియదని, పవన్ కల్యాణ్ మాత్రం ఓ మంచి నాయకుడు అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావొచ్చని, ఆ అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలనేదే తన అభిమతమని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని మెగాస్టార్ భరోసా ఇచ్చారు అప్పట్లో.

రాటు దేలాలి..
ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు చిరంజీవి. పూర్వ మిత్రుల సమ్మేళనంలో చిరంజీవి మాట్లాడారు. సున్నిత మనస్కులకు రాజకీయాలు సరిపోవని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగాలంటే సెన్సిటివ్‌గా ఉండకూడదని పేర్కొన్నారు. బాగా రాటుదేలాల్సిన అవసరం ఉంటుందని, మొరటుగా వ్యవహరించాలని అన్నారు. నాలుగు మాటలు అనాలి.. అనిపించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

సున్నితంగా ఉంటే రాణించలేం..
సెన్సిటివ్‌గా ఉంటే రాజకీయాల్లో రాణించలేమని, ఇదంతా తనకు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌ను ప్రస్తావించారు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. రాజకీయాల్లో రాణించే సత్తా, శక్తి సామర్థ్యాలు పవన్ కల్యాణ్‌కు ఉన్నాయని ప్రశంసించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు తగినవాడని కితాబిచ్చారు. నాలుగు అంటాడు.. అనిపించుకోగలుగుతాడని, అలాంటి వాళ్లకు రాజకీయాల్లో స్థానం ఉందని చెప్పారు.

ఏదో ఒక రోజు అత్యున్నత స్థానంలో చూస్తాం..
ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్- రాష్ట్రంలో అత్యున్నత పదవిని అందుకుంటాడని చిరంజీవి అన్నారు. అందరి సహాయ, సహకారాలతో ఉన్నత స్థానానికి ఎదుగుతాడని చెప్పారు. ఏదో ఒకరోజు పవన్ కల్యాణ్‌ను ఆ స్థానంలో చూస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. తాను జీవితంలో అనుకున్నవి అన్నీ చేశానని, ఆ ఒక్కదాంట్లో మాత్రం అంతుచూడలేకపోయానని చిరంజీవి పరోక్షంగా తన రాజకీయ జీవితం గురించి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications