కిల్..బిల్.. పాండే..!!
అమరావతి: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజూ వార్తల్లో నిలుస్తోన్న అంశం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర. త్వరలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోన్నారు. ఇందులో భాగంగా వారాహి పేరుతో ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు కూడా. హైదరాబాద్‌లో దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఈ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
వారాహి వాహన రిజిస్ట్రేషన్ కొంత గందరగోళానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆలివ్ గ్రీన్ కలర్ వాహనం కావడం వల్ల దానికి రవాణాశాఖ అధికారులు రిజిస్ట్రేషన్ చేయబోరనే వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. సైనిక వాహనాలకు మాత్రమే ఆలివ్ గ్రీన్ రంగు వాడుకునే వెసలుబాటు ఉందని, ప్రైవేటు వాహనాలేవీ దాన్ని వినియోగించకూడదంటూ మోటార్ వెహికల్ యాక్ట్ స్పష్టం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

తెలంగాణ అధికారులు మాత్రం వారాహికి రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి వేసిన రంగును ఎమరాల్డ్ గ్రీన్ కావడం వల్లే రిజిస్ట్రేషన్ చేశామనీ చెబుతోన్నారు. టీఎస్ 13 ఈఎక్స్ 8384 అనే నంబర్‌ను దీనికి కేటాయించారు. ఇదే వాహనాన్ని 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచార రథంగా కూడా పవన్ కల్యాణ్ వినియోగించనున్నారు. దీనికి అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చేశారు.
నిజానికి- ఈ ఏడాది అక్టోబర్‌లో విజయదశమి తరువాత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాల్సి ఉంది. దీన్ని వాయిదా వేసుకున్నారాయన. జిల్లాలవారీగా నిర్వహిస్తోన్న జనసేన-జనవాణి కార్యక్రమాన్ని ముగించుకున్న తరువాత బస్సు యాత్రకు పూనుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవాణి ద్వారా ప్రజల కష్టనష్టాలు తెలుస్తాయని, వాటిపై లోతుగా అధ్యయనం చేయడం- బస్సు యాత్రకు మరింత ఉపకరిస్తుందనేది జనసేన పార్టీ నేతల అభిప్రాయం.
Kill..bill..pandey ! pic.twitter.com/rrbGtoc3ha
— Ambati Rambabu (@AmbatiRambabu) December 13, 2022
ఫలితంగా- బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారు పవన్ కల్యాణ్. వచ్చే జనవరిలో సంక్రాంతి పండగ ముగిసిన తరువాత వారాహి వాహనాన్ని రోడ్డెక్కించనున్నారు. కాగా- వారాహిపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతూనే ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల నుంచి. తాజాగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సైతం వారితో జత కలిశారు. వారాహి వాహనం, పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దానికి కిల్..బిల్.. పాండే అనే కామెంట్‌ను యాడ్ చేశారు.












Click it and Unblock the Notifications