పుంగనూరులో చేతులెత్తేసిన పెద్దిరెడ్డి..! గేమ్ ఛేంజర్ గా నిలిచిన ఏపీ మంత్రి..!
రాష్ట్ర రాజకీయాల్లో,అందులోనూ రాయలసీమలో పుంగనూరుకు ఓ ప్రత్యేక స్ధానం ఉంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధికారంలో ఉన్నా, లేకపోయినా పుంగనూరులో పట్టు కొనసాగిస్తూ వచ్చిన పెద్దిరెడ్డి.. ఇప్పుడు తొలిసారిగా అదే పుంగనూరులో చేతులెత్తేశారు. చంద్రబాబుతో రాజకీయాల్లో సై అంటూ సై అంటూ రాజకీయాలు నడిపినట్లు చెప్పుకునే పెద్దిరెడ్డి.. ఇప్పుడు ఆయన కేబినెట్ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ధాటికి తట్టుకోలేక చేతులెత్తేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పుంగనూరులో పెద్దిరెడ్డి వెనుకడుగు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. అయితే చాలా చోట్ల వైసీపీ అభ్యర్ధులు నామినేషన్ల దాఖలుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి పలు చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో మాత్రం వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది. పెద్దిరెడ్డి అడ్డాగా చెప్పుకునే పుంగనూరులో, అదీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇలా వైసీపీ ఎన్నికల్లో బరిలోకి దిగకుండా తప్పుకోవడం సీమలో చర్చనీయాంశమవుతోంది. అయితే దీని వెనుక ఈ జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రిగా ఉన్న బీసీ జనార్ధన్ రెడ్డి (BC Janardhan Reddy ) పాత్ర చాలా కీలకంగా నిలిచింది.

మంత్రి జనార్ధన్ రెడ్డి చాణక్యం
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, ఎంపీ మిథున్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలో టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసేలా అల్లర్లు సృష్టించారు. మిథున్ రెడ్డి కారులో కూర్చొని టీడీపీ శ్రేణులను తొక్కించడానికి పరుగులు తీయించారు. దీంతో టీడీీప అధిష్టానం జిల్లా ఇన్ చార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో పుంగనూరు వెళ్లిన మంత్రి జనార్ధన్ రెడ్డి.. టీడీపీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు అక్కడే పాగా వేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల ప్రక్రియలో ధైర్యంగా ముందుకు సాగాలని వారికి భరోసా ఇచ్చారు. దీంతో క్యాడర్ కూడా గట్టిగా పోరాడాలని నిర్ణయించుకుంది. అదే కీలక మలుపుగా మారింది. ముఖ్యంగా బీసీ జనార్ధన్ రెడ్డి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం ద్వారా ఇందులో కీలక పాత్ర పోషించారు.

పెద్దిరెడ్డినే వెనక్కి తగ్గేలా చేసిన వ్యూహాలు
తాజా పరిణామాలతో 24 గంటల్లోనే పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని పెద్దిరెడ్డి ప్రకటించాల్సిన పరిస్ధితి ఎదురైంది. అయితే పెద్దిరెడ్డి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి చివరి నిమిషంలో చేసిన క్యాడర్ సమన్వయం ఒక్కటే కాదు.. పుంగనూరులో పాగా వేయాలన్న దీర్ఘకాలిక వ్యూహం కూడా పనికొచ్చిందని తెలుస్తోంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్న బీసీ జనార్ధన్ రెడ్డి నియోజకవర్గంలో రహదారుల్ని సుందరంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిధులు కేటాయించారు. అలాగే పార్టీ శ్రేణులకు సరైన సమయంలో అండగా నిలవడం, క్షేత్రస్థాయిలో సమన్వయం సాధించడం, ప్రత్యర్థి రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనేలా కార్యకర్తల్లో ధైర్యం నింపడం వంటి అంశాలతో ఆయన గేమ్ ఛేంజర్ గా నిలిచారు. ఈ పరిణామాలే చివరికి పెద్దిరెడ్డి వంటి సీనియర్ నేతను వెనక్కి తగ్గేలా చేశాయి. స్థానిక ఎన్నికల వేళ పుంగనూరులో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఇక్కడి రాజకీయాన్ని టీడీపీకి అనుకూలంగా మార్చబోతున్నట్లు చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications
