ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి నేడే.. ఎందుకో చెప్పిన మంత్రి!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైన దీపావళి నేడేనని, గతేడాది ఇదే రోజు చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేసి జైలుకు పంపితే , ఈ ఏడాది చంద్రబాబు సీఎంగా ప్రజల కోసం పరితపిస్తూ పని చేస్తున్నారని , రాష్ట్ర మైన్స్ జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుడమేరు ఘటన వెనుక కుట్ర కోణం ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నేటితో ఏడాది
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఇదే సెప్టెంబర్ 9 సమయానికి చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేశారని, నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నేటితో ఏడాది అని పేర్కొన్న మంత్రి 53 రోజులపాటు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు.గత ఏడాది సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రజలంతా కన్నీరు పెట్టుకున్నారన్నారు.

ప్రజలు బ్రహ్మరథం పట్టటంతో నేడు సీఎంగా చంద్రబాబు
ఇదే సెప్టెంబర్ 9న ఇప్పుడు ప్రజల కోసం సీఎం పరితపిస్తున్నారని, వరద బాధితుల రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, ప్రజలు చంద్రబాబుకి బ్రహ్మరథం పట్టటంతోనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. పండగ రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు అని మంత్రి కొల్లు రవీంద్ర కితాబిచ్చారు. 9రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి ఆయన పని చేస్తున్నారని, యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారన్నారు.
విజయవాడ వరదలు, ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ కుట్ర పై మంత్రి వ్యాఖ్యలు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు వచ్చాయని బుడమేరు, పోలవరం మట్టి దోచేశారని, అందుకే ఈ పరిస్థితులు వచ్చాయని ఆయన ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూశారని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు.విజయవాడ కలెక్టరేట్లోనే ఉండి సీఎం సహాయక చర్యలు చేపడుతుంటే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతీ నిముషం చంద్రబాబు ప్రజల కోసం కష్టపడుతున్నారు
చంద్రబాబు ప్రజల కోసం ప్రతి నిమిషం కష్టపడుతున్నారన్నారు. చంద్రబాబు తన ఇల్లు కాపాడుకోవడం కోసం విజయవాడను ముంచేశారని ఆరోపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, పాలు, మెడిసిన్స్ తదితర నిత్యావసరాలు సరఫరా జరుగుతున్నాయని, స్వయంగా చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications