విజయవాడ జనసేనకు దక్కేనా, కొత్త లెక్కలు- కూటమిలో ఎవరికెన్ని.. ఏవి..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ మరి కొద్ది గంటల్లో విడుదల కానుంది. ఇప్పటికే మున్సిపల్ రిజర్వేషన్లు ప్రకటించారు. కూటమిలో సీట్ల సర్దుబాటు పైన చర్చలు జరుగుతున్నాయి. ముందుగా జనసేన- బీజేపీ పోటీకి సిద్దమైన లెక్కలు తాజాగా రిజర్వేషన్ల ప్రకటనతో తారు మారు అయ్యాయి. దీంతో.. ఇప్పుడు ఎవరికి ఏ సీటు దక్కుతుందనేది కీలకంగా మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
కూటమిలో స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు- వపన్ చర్చల వేళ పార్టీల సీట్ల జాబితాల పైన చర్చ జరిగింది. తాజా గా రిజర్వేషన్లు ఖరారు చేసారు. దీంతో, జనసేన నేత మనోహర్, బీజేపీ మాధవ్ తాజాగా సీఎం చంద్రబాబుతో మరోసారి సమావేశం అయ్యారు. ఈ భేటీలో తమకు 2024 ఎన్నికల్లో కేటాయించి న సీట్ల శాతానికి రెట్టింపు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. 2024లో జనసేనకు 12 శాతం సీట్లు కేటాయించారు. స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ 20 నుంచి 25 శాతం సీట్లు కేటాయించాలని కోరుతోంది. ఈ లెక్కన మూడు కార్పొరేషన్లు, 25 మున్సిపాలిటీలు/నగరపంచాయతీలను ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. బీజేపీకి 10 శాతం సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు రిజర్వేషన్లను ప్రకటించడంతో తాము ముందుగా అనుకున్న సమీకరణాల్లో మార్పులు వచ్చాయని జనసేన, బీజేపీ నేతలు పేర్కొన్నట్లు సమాచారం.

పవన్ తో టీడీపీ నేతల సమావేశం
కాగా.. హడావిడిగా రిజర్వేషన్లు ప్రకటించడంపైనా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. వాటిని మార్చేందుకు ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలించాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. రిజర్వేషన్ల ప్రకటనపై తమ పార్టీలోనూ అసంతృప్తి ఉన్నప్పటికీ చట్టబద్ధంగా జరగాల్సిన ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని, రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. తాము ముందుగా అనుకున్న స్థానాలు రిజర్వేషన్ల కారణంగా తారుమారు అయ్యాయని... కొత్త స్థానాల ఎంపిక, అక్కడ అభ్యర్థులు ఎవరన్న దానిపై తమ పార్టీల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని జనసేన, బీజేపీ కోరాయి. జనసేనకు కేటాయించే మూడు కార్పొరేషన్ స్థానాలపై సందిగ్ధత కొనసాగుతోంది. విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ కార్పొరేషన్లను జనసేన కోరుతోంది. అయితే రాజధాని ప్రాంతంలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు కీలకమైన స్థానాలను జనసేనకు ఇవ్వడం ఎంత వరకు సమంజసమనే చర్చ మొదలైంది.
ఇక, తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు కోరినట్లు తెలిసింది. అయితే.. నెల్లూరులో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ బీజేపీ పోటీ చేయడం సరైన నిర్ణయం కాబోదని టీడీపీ నేతలు సూచించడంతోపాటు తిరుపతి స్థానం నుంచి టీడీపీ బరిలో ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. వేరే ఏదైనా కార్పొరేషన్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో.. పవన్ తో జనసేన కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి రామానాయుడు సమావేశం అవుతున్నారు. తాజా ప్రతిపాదనల పైన చర్చ జరగనుంది. ఈ రాత్రికి ఈ మొత్తం జాబితాల పైన సీఎం చంద్రబాబు వద్ద సమావేశం జరగనుంది. ఆ భేటీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications
