హాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ హవా- కీరవాణికి మరో ప్రిస్టేజియస్ అవార్డ్..!!
అమరావతి: హాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతోంది. మొన్నటికి మొన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుందీ మూవీ. తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా అందుకున్న బాక్సాఫీస్ కలెక్షన్లు 1,000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేశాయి.

గోల్డెన్ గ్లోబ్ తో..
ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డును అందుకుంది. మరో మెట్టు పైకి ఎక్కిందీ మూవీ. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని సూపర్ హిట్ పాట నాటు నాటు.. ఈ కేటగిరీలో బెస్ట్ ఒరిజినల్ ట్రాక్ అవార్డును సొంతం చేసుకుంది. అమెరికా కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ లోని బేవర్లీ హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ప్రశంసల సునామీ
కాగా- ఈ అవార్డు దక్కడంపై చిత్రం యూనిట్‌పై ప్రశంసల సునామీ కురిసింది. ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో వేల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించారని ప్రశంసించారు. తెలుగువాడికి ఇది గర్వకారణమని, మూవీ యూనిట్‌ను చూసి తాము గర్వపడుతున్నామని చెప్పారు.

లాస్ ఏంజిలిస్ క్రిటిక్స్ అవార్డ్..
ఇప్పుడు తాజాగా- మరో ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. లాస్ ఏంజిలిస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఇందులోని నాటు నాటు పాట బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఎంపికైంది. ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి- ఈ అవార్డును అందుకున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు పావే మైకీటిన్ ను కాదని ఈ అవార్డు కోసం ఎంఎం కీరవాణిని ఎంపిక చేశారు ఎల్ఏఎఫ్‌సీఏ జ్యూరీ సభ్యులు.

ఇదివరకు న్యూయార్క్ నుంచి..
ఇదివరకు న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించిన అత్యుత్తమ దర్శకుల జాబితాలో ఆర్ఆర్ఆర్ కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి- ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. దీని తరువాత ఆర్ఆర్ఆర్ టాప్ 10 ఉత్తమ చిత్రాల కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూస్‌లో ఏడవ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.












Click it and Unblock the Notifications