భువనేశ్వరికి చీర తీసుకొచ్చిన చంద్రబాబు
భార్యాభర్తల బంధం అనేది అనిర్వచనీయమైన అనుబంధం. ఎవరు ఎవరికి రాసిపెట్టి ఉంటారు అనే విషయాన్ని భగవంతుడు ముందుగానే నిర్ణయిస్తాడంటారు. వివాహమైన తర్వాత తనకోసం తల్లిదండ్రులను, తోబుట్టువులను, పుట్టిపెరిగిన ప్రాంతాన్ని వదులుకొని వచ్చే భార్యను ఎంతో ప్రేమగా చూసుకునే బాధ్యత కూడా భర్తపై ఉంటుంది. కుటుంబ జీవితంలో భర్త తనకోసం ఏం తెచ్చినా, అది చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా భార్య ఎంతో ప్రేమగా స్వీకరిస్తుంది. దాని ఖరీదును పట్టించుకోదు. అక్కడ ప్రేమ ఒక్కటే ప్రాధాన్యం.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 40 సంవత్సరాలుగా నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఉన్నారు. ఆయన అలా ఉండటానికి ప్రధాన కారణం భార్య భువనేశ్వరి. ఆమెనుంచి మద్దతు ఉండటంవల్లే రాజకీయ జీవితాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అంత బిజీగా ఉండే చంద్రబాబును భువనేశ్వరి ఒకసారి.. భర్తలంతా తమ భార్యల కోసం చీరలు తీసుకొస్తారు.. నాకెందుకు మీరు తీసుకురారు అంటూ ప్రశ్నించారు. దీంతో ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకున్న చంద్రబాబు తన భార్య కోసం ప్రేమగా ఒక చీర తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత దాన్నిచూసిన భువనేశ్వరికి ఒక్కసారిగా మతి పోయినంత పనైంది.

ఆ చీరకు ఉన్న రంగులు చూసి అంత పనైంది. అయినా తన భర్త ఎంతో ప్రేమగా తనకోసం తెచ్చారు కాబట్టి భద్రంగా బీరువాలో దాచుకున్నారు. 30 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయాన్ని తాజాగా భువనేశ్వరి వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత మహిళలతో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. వెంటనే వేదికపై ఉన్న భువనేశ్వరితోపాటు మాజీ మంత్రి పరిటాల సునీత, ఇతర మహిళలు నవ్వును ఆపుకోలేకపోయారు. చంద్రబాబుకు తొలి ప్రాధాన్యం ప్రజలేనని, తర్వాతే కుటుంబ సభ్యులని భువనేశ్వరి చెప్పారు.












Click it and Unblock the Notifications