ఏపీలో కొత్త రైల్వే లైను.. విజయవాడ నుంచి సికింద్రాబాద్ 3.30 గంటలు
కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువదీరిన తర్వాత రైల్వే ప్రాజెక్టులు శరవేగంతో పరుగులు తీస్తున్నాయి. ఏపీలో కూడా ఎన్డీయే ప్రభుత్వమే ఉండటంతో కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ చకచకా పట్టాలెక్కుతున్నాయి. వీటికి సంబంధించిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరికొన్ని ప్రాజెక్టుల వ్యయం మొత్తాన్ని తానే భరించనుంది. రాష్ట్రంలో కీలకంగా మారిన నల్లపాడు-బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తిచేయాలనే ఉద్దేశంతో పనులను విడదీసి కాంట్రాక్టర్లకు అప్పగించారు.
మొత్తం వ్యయాన్ని భరిస్తోన్న కేంద్ర ప్రభుత్వం
నల్లపాడు-బీబీనగర్ మధ్య డబ్లింగ్ పనులతోపాటు విద్యుదీకరణకు మొత్తం రూ.2853 కోట్లు అవుతుందని అంచనా. 248 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. పనులను విడదీసి కాంట్రాక్టర్లకు అప్పగించడంవల్ల పేనులు తొందరగా పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో నడికుడి-కుక్కడం మధ్య 47 కిలోమీటర్లు, రూ.571 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయి. రెండో దశలో నల్లపాడు-బెల్లంకొండ మధ్య 56 కిలోమీటర్ల పనులకు రూ.600 కోట్ల వ్యయమవుతందనే అంచనాతో టెండర్లు పిలిచారు. వీటితర్వాత కుక్కడం-వెలిగొండ 75 కిలోమీటర్ల పనులను రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఇవన్నీ ఏకకాలంలో పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. రూ.1871 కోట్ల వ్యయంతో మొత్తం ఆరు దశల్లో మూడు దశల పనులను ప్రారంభించారు.

భూసేకరణకు నోటిఫికేషన్లు విడుదల
కొన్ని ప్రాంతాల్లో భూములు అవసరంకాగా వాటి సేకరణకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఏపీ పరిధిలో ఉన్న భూముల కోసం సేకరణ ప్రక్రియ నడుస్తుండగా, తెలంగాణ పరిధిలో ఉన్న భూముల కోసం సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. డబుల్ లైన్ అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి సికింద్రాబాద్ కు కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి ఇదే మార్గంలో వస్తే 3.40 గంటల సమయంలో చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి చెన్నై, తిరుపతికి ఇది ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. గుంటూరు నుంచి తెనాలి మీదుగా చెన్నై మార్గంలో కలుస్తుంది. అలాగే నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను పూర్తయితే మరో ప్రత్యామ్నాయ రైల్వే లైను అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. రెండు సంవత్సరాల్లో మొత్తం పనులు పూర్తవుతాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications