ఏపీలో కులాల పోరు లేదు, కేవలం వర్గపోరే-ఇదే నిదర్శనమంటున్న విజయ సాయిరెడ్డి ..
ఏపీలో సీఎం జగన్ ఈ మధ్య పదే పదే క్లాస్ వార్ గురించి ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో పేదలకూ, ధనిక వర్గాలకూ మధ్య పోరు జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కులాల పోరు నడిచే ఏపీ వంటి రాష్ట్రంలో ఇప్పుడు క్లాస్ వార్ మొదలైందంటూ వైసీపీ సర్కార్ మొదలుపెట్టిన చర్చపై రాష్ట్రంలో ఓటర్లు కూడా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్లాస్ వార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించారు.
ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది కులాల మధ్య పోరు కాదని, ఇది ధనిక, పేద వర్గాల మధ్య పోరాటం అనే వాస్తవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడం కొందరికి విస్మయం కలిగించిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. చాలా మందికి ఇది మింగుడు పడడం లేదన్నారు. నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలోని పేదలు, దిగువ మధ్య తరగతి, ఇంకా ప్రభుత్వ సాయం, ఆసరా అవసరమైన అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తోందన్నారు.

అన్ని ఆర్థిక ఇబ్బందులనూ అధిగమించి, ఎంతో శ్రమకోర్చి సకల జనుల కల్యాణమే పరమార్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని సాయిరెడ్డి తెలిపారు. ఐదున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ఏ కుటుంబమూ ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యతో బాధపడకుండా చూడడానికి ప్రభుత్వమూ, పాలకపక్షమూ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి నచ్చచెప్పి మరీ వేలాది కోట్ల రూపాయలు ఏపీకి మంజూరు చేయించి, బడుగు బలహీనవర్గాల ఆయురారోగ్యాల కోసం ఆ ధనాన్ని రాష్ట్ర సర్కారు ఖర్చుచేస్తోందని సాయిరెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇలా సాగుతుంటే.. కులాల మధ్య కుమ్ములాటలు ఉన్నట్టు కొందరు చాలా కాలంగా చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని సాయిరెడ్డి విమర్శించారు. మూడున్నర సంవత్సరాలు ఓపిక పట్టిన ముఖ్యమంత్రి కిందటేడాది డిసెంబర్ నెలలోనే ఈ విషయంపై సూటిగా అర్ధమయ్యే మాటలతో స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. ఇక్కడ ధనికులుకు, పేదలకు మధ్య పోరు అంటే ఈ రెండు వర్గాల మధ్య హింసాత్మక భౌతిక పోరాటం కాదని, తమ సంపద మరింత పెంచుకోవడానికి సంపన్నులు అక్రమమార్గంలో పేదలను దోపిడీ చేస్తున్నప్పుడు, బడుగులు వారిని ప్రతిఘటించడం అని గ్రహించాలన్నారు. ఈ ప్రతిఘటనలో పేదల పక్షాన పాలకపక్షమైన వైసీపీ ప్రభుత్వం, కార్యకర్తలు ఉండాలనేది జగన్ ఉద్దేశమన్నారు.












Click it and Unblock the Notifications