నందమూరి కుటుంబంపై వీరాభిమానం.. పెళ్లి ఆహ్వాన పత్రికపై ఎన్టీఆర్, బాలయ్యలు!!
నందమూరి కుటుంబంపై వీరాభిమానంతో విశాఖ జిల్లాకు చెందిన ఒక కుటుంబం పెళ్లి ఆహ్వాన పత్రికపై ఎన్టీఆర్, బాలయ్యల ఫోటోలతో ఇన్విటేషన్ లు పంచుతున్నారు.
సాధారణంగా వివాహ వేడుక అంటే... పెళ్లి పత్రికలలో దేవుళ్లకు సంబంధించిన ఫోటోలను వేసి వివాహ ఆహ్వాన పత్రికలను ముద్రించి, బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. అయితే నందమూరి కుటుంబంపై ఉన్న వీరాభిమానంతో వారి ఫోటోలను వేసి ఓ అభిమాని 6 పేజీల వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించి అందరినీ తమ కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానిస్తున్నారు. నందమూరి కుటుంబం పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటున్నారు. అయితే వివాహ ఆహ్వాన పత్రికపై ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ ఫోటోలు ఉండడం ఆ వివాహ ఆహ్వాన పత్రికలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

లెక్కకు మిక్కిలిగా నందమూరి అభిమానులు
నందమూరి ఫ్యామిలీకి కోట్లాదిమంది అభిమానులు ఉంటారు. అది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రాంతం, భాష, వర్ణం, వర్గం అన్న తేడా లేకుండా లెక్కకు మిక్కిలిగా నందమూరి అభిమానులు ఉంటారు. ఇక నందమూరి కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి నందమూరి కుటుంబం సంతోషపడితే సంతోషపడేవాళ్లు, నందమూరి కుటుంబం బాధలో ఉంటే బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఎంత అభిమానం ఉన్నప్పటికీ ఎవరూ తమ ఇంట్లో జరిగే శుభకార్యాలలోనూ వారు ఉన్నారు అన్న ప్రమేయాన్ని చూపించరు.

వివాహ ఆహ్వాన పత్రికలో ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలు
కానీ విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామానికి చెందిన పులమరశెట్టి వెంకటరమణ తమ కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలో నందమూరి తారకరామారావు ఫోటోలను, బాలకృష్ణ ఫోటోలను ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. పులమరశెట్టి వెంకట రమణకు ఎన్టీఆర్ అంటే పిచ్చి.. ఇక ఆయన కుమారుడు పులమరశెట్టి కోమలి పెద్దనాయుడుకి బాలకృష్ణ అంటే వీరాభిమానం. దీంతో వారు తమ అభిమానాన్ని జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహ వేడుకలో చూపించే యత్నం చేస్తున్నారు.

నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో అంటూ పెళ్లి కార్డులు
ఇటీవల పెద్దనాయుడికి వివాహం కుదరడంతో మార్చి 11వ తేదీన పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించారు. ఇక పెళ్లి పిలుపు కోసం ముద్రించిన ఆరు పేజీల ఆహ్వాన పత్రిక పైన బాలకృష్ణ, ఎన్టీఆర్ చిత్రాలను ముద్రించి వారు నందమూరి కుటుంబం పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక పెళ్లి కార్డు పైన కూడా నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో అని రాసుకొచ్చారు. ఆహ్వానం అందుకుంటున్న అతిథులు పెళ్లి కార్డులను ఆసక్తిగా తిలకిస్తున్నారు.












Click it and Unblock the Notifications