ఏపీలో పెన్షన్లకు 13.65 లక్షల దరఖాస్తులు-అప్పుడే 1.42 లక్షల మంది ?
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా ఇవ్వబోతున్న పెన్షన్లకు (NTR Bharosa Pensions) దరఖాస్తులు పోటెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 13.65 లక్షల మంది ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని అప్పుడే పరిశీలించడం కూడా మొదలుపెట్టారు. ఇందులో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల స్ధాయిలోనే 1.42 లక్షల దరఖాస్తుదారుల్ని అనర్హులుగా గుర్తించారు. త్వరలో రాష్ట్రస్ధాయిలో కూడా దరఖాస్తుల పరిశీలన జరగబోతోంది. అంటే భారీ సంఖ్యలో అనర్హులుగా తేలే అవకాశాలున్నాయి.
కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో వృద్ధాప్య పింఛన్ల కోసమే 6.88 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇక వితంతు పెన్షన్ల కోసం 2.97 లక్షలు, చేనేత పెన్షన్ల కోసం 21,565 మంది, దివ్యాంగ పెన్షన్ల కోసం 1.81 లక్షల మంది, కల్లుగీత పెన్షన్ల కోసం 16430 మంది, మత్సకార పెన్షన్ల కోసం 31825 మంది, ఒంటరి మహిళల పెన్షన్ కోసం 9201 మంది, డప్పు కళాకారుల పెన్షన్ల కోసం 50972 మంది, చర్మకారుల పెన్షన్ల కోసం 67853 మంది, హిజ్రాల పెన్షన్ల కోసం 800 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల స్ధాయిలో ఆరు అంచెల పరిశీలన పూర్తి చేశారు. వీరిలో 1.42 లక్షల మంది అనర్హులు తేలారు. వీటిని మరోసారి రాష్ట్రస్దాయిలో తనిఖీ చేస్తారు.

మరోవైపు ఈ పెన్షన్ దరఖాస్తుల తీరు పలు చోట్ల అధికారులకు షాకిచ్చింది. వితంతు పెన్షన్లకు ఇప్పటివరకూ 2.3 లక్షల మందికి ఇస్తుండగా.. ఇప్పుడు కొత్తగా 2.97 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యపరిచించి. ఇందులో గత వైసీపీ హయాంలో భర్తలు చనిపోయిన వారే 1.3 లక్షల మంది ఉండగా.. కూటమి సర్కార్ హయాంలో 1.10 లక్షల మంది ఉన్నారు. వీరిలో తాజాగా అనర్హులుగా తేల్చిన 38121 మందిలో కొందరు భర్తలు చనిపోయినా రేషన్ కార్డులో మాత్రం భర్తల పేర్లు ఉన్నాయి. దీంతో రేషన్ కార్డు పోతుందనే భయంతో పేర్లు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. ప్రతీ జిల్లాలోనూ సగటున 50 వేల కొత్త పెన్షన్ దరఖాస్తులు రాగా.. గిరిజన ప్రాంతాల్లో మాత్రం కాస్త తక్కువగా వచ్చాయి.














Click it and Unblock the Notifications
