పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అదిరిపోయే బహుమతి ఇవ్వనున్న నాగబాబు, జనసేన!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సెప్టెంబరు 2న రానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 2వ తేదీన పార్టీ నాయకులు, శ్రేణులు కలిసి ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాలని, సమాజానికి అవసరం అయ్యే కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పిలుపునిచ్చారు.
పవన్ పుట్టినరోజున జనసేన క్లీన్ ఆంధ్ర - గ్రీన్ ఆంధ్ర
సెప్టెంబరు 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నేడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి నాగబాబు ,ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో మాట్లాడారు. సెప్టెంబరు 2వ తేదీన జనసేన నాయకులు 'క్లీన్ ఆంధ్ర - గ్రీన్ ఆంధ్ర' కాన్సెప్ట్ తో కార్యక్రమాలను నిర్వహించాలని , దీనిలో అందరూ పాల్గొనాలని కోరారు.

సమాజహితమైన కాన్సెప్ట్ తో కార్యక్రమాలు చెయ్యాలన్న మంత్రి నాదెండ్ల
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ''సమాజాన్ని ఎంతో ఇష్టపడే నాయకుడిగా, ప్రకృతిని అమితంగా ప్రేమించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆశయాల మేరకు పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం రోజు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు. సమాజహితమైన కాన్సెప్ట్ తో ప్రజలంతా మెచ్చేలా కార్యక్రమాలు చేపడదాం అన్నారు .
పర్యావరణ హిత కార్యక్రమాలు చెయ్యండని పిలుపు
క్లీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కాలువలను శుభ్రం చేయడం, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం, స్కూళ్లు, ఇతర ప్రాంతాలను స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండేలా చేయడం వంటి కార్యక్రమాలు చేయాలన్నారు. భవిష్యత్తులో భారీ వృక్షాలుగా పెరిగేందుకు అవకాశం ఉన్న రావి, వేప, ఉసిరి, కానుగ, చింత లాంటివి నాటాలన్నారు. దేశీయ జాతులు, పర్యావరణ హితమైన మొక్కలు నాటాలని సూచించారు.
పవన్ కు ఈ బహుమతి ఇద్దాం అన్న నాగబాబు
టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు మాట్లాడుతూ ''పార్టీ తీసుకున్న కార్యక్రమాన్ని ప్రతి జన సైనికుడు, వీర మహిళ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. క్లీన్ ఆంధ్ర - గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం కచ్చితంగా పవన్ కళ్యాణ్ మెచ్చే కార్యక్రమం అవుతుంది. ఆయనకు మనమంతా స్వచ్ఛ హరిత హారాన్ని బహుమతిగా అందిద్దామని సూచించారు. ఈ కార్యక్రమంతో పాటు ప్లాస్టిక్ రహిత ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ద్వారా మొదటి అడుగు వేయండి అన్నారు












Click it and Unblock the Notifications