కడప ప్రజలకు ఆ సమస్య తీరుస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో టీచర్లను తల్లిదండ్రులను ఒక చోటికి చేర్చి స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు బాపట్లలో ఈ కార్యక్రమంలో పాల్గొనగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్
కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం బేగంపేట విమానాశ్రయం నుంచి కడపకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆపై పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో హై స్కూల్ కి వెళ్లి అక్కడ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఉన్న అమ్మవారికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు.

కడప స్కూల్ లో పేరెంట్స్ టీచర్స్ మీట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్
ఆపై పేరెంట్స్ టీచర్స్ మీట్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక తల్లిదండ్రులతో మాట్లాడి వారి వద్ద నుండి కూడా అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చదువుల నేల రాయలసీమకు తాను వచ్చానని పేర్కొన్నారు.
రాయలసీమకు పునర్వైభవం రావాలని ఆకాంక్ష
ఒకప్పుడు రాయలసీమలో అత్యధికంగా లైబ్రరీలు ఉండేవని, ఎంతోమంది మహానుభావులు రాయలసీమ నుంచి వచ్చిన వారని అటువంటి రాయలసీమకు పునర్వైభవం రావాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2014 - 2019 సంవత్సరంలో ఉద్దానం సమస్యను బయటకు తీసుకువచ్చానని, ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్ల రూపాయలతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారని ఆయన పేర్కొన్నారు.
కడపలో ఆ సమస్య పరిష్కారం చేస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్
కడప ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు కనుక ఈ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉండవని, సమస్యలు తీరిపోయి ఉంటాయి అనుకున్నానని, అయితే కడపలో ఇంత నీటి సమస్య ఉందని అనుకోలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. పులివెందుల తాగునీటి ప్రాజెక్టు కోసం 45 కోట్ల రూపాయలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజల నీటి సమస్యను తీర్చి ఇక్కడ ప్రజలను తాము ఆదుకుంటామని మాటిస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications