జగన్! పేర్లు మార్చి ఏం సాధిస్తారు? సొంత డబ్బుతో కట్టారా?: పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్నలు
అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆ వర్సిటీని ఏమైనా మీ సొంత డబ్బుతో కట్టారా? అని ప్రశ్నించారు. పేర్లు మార్చడం ద్వారా ఏం సాధిస్తారని నిలదీశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ వర్సిటీగా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.

వైఎస్ఆర్ పేరు పెడితే ఏం జరుగుతుంది?: పవన్ కళ్యాణ్
ఎన్టీఆర్ పేరు బదులు వైఎస్ఆర్ పేరు పెడితే వర్సిటీలో వసతులు మెరుగవుతాయా? విద్యార్థులకు మౌలిక వసతులు కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థంలేని చర్య అని పవన్ కళ్యాణ్ అన్నారు. కొత్త వివాదాలను సృష్టించేందుకే వైసీపీ ప్రభుత్వం ఈ పనిచేసిందని మండిపడ్డారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరు మార్చవచ్చు కదా అని అన్నారు. ఇంట్లోవాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టడం ఏంటని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల పేర్లు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.

పేర్లు మార్చి ఏం సాధిస్తారంటూ పవన్ కళ్యాణ్
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరులో మార్పు చేయడం ద్వారా ఏమీ సాధించాలనుకుంటున్నారో రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమండ్ చేశారు. పేరు మార్పుతో వసతులు మెరుగవుతాయా? అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ తగినన్ని పడకల్లేవని, సిబ్బంది అందుబాటులో లేరని అన్నారు. ఔషధాలు కూడా ఉండవని అన్నారు. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకే డాక్టర్ సుధాకర్ ను వేధించారని.. దీంతో మానసిక వ్యథకు లోనై మరణించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని అన్నారు. మెరుగుపర్చాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వవిద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదన్నారు.

బ్రిటీష్ వాసన.. వైద్య ప్రముఖుల పేర్లు పెట్టాలంటూ పవన్ కళ్యాణ్
ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో.. కొత్త వివాదాలు సృష్టించేందుకో వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలా ఉందన్నారు పవన్. పేర్లు మార్చాలనుకుంటే.. విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరు మార్చవచ్చు కదా అని ప్రశ్నించారు. ఆ పేరు ఇంకా బ్రిటీష్ వాసనలతో ఉంది. స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం గనక విశాఖ కేజీహెచ్ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టండి అని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రఖ్యాత వైద్యరంగ ప్రముఖుల్లో ఒకరైన దివంగత యల్లాప్రగడ సుబ్బారావు పేరైనా ఈ పాలకులకు తెలుసా? అని ప్రశ్నించారు. హెల్త్ వర్సిటీకి ఆ రంగంలోని ప్రముఖుల పేరు పెట్టాలనే చిత్తశుద్ధితో కూడిన ఆలోచన ఉండి ఉంటే.. యల్లాప్రగడ సుబ్బారావు పేరును పరిగణించేవారని పవన్ కళ్యాణ్ అన్నారు. యల్లాప్రగడ.. టైఫాయిడ్, బోదకాలు లాంటి రోగాలకు మందులు కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప తెలుగు శాస్త్రవేత్త అని పవన్ తెలిపారు.












Click it and Unblock the Notifications