పార..పలుగు చేతబట్టి - జనసేనాని శ్రమదానం : కదిలి వచ్చిన పార్టీ శ్రేణులు..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలు- పలుగు చేతబట్టారు. శ్రమదానం చేసారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు మద్దతుగా దీక్షకు దిగనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేసారు. దీని కోసం హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్న పవన్ కు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో వడ్డేశ్వరం దగ్గరి సర్వీస్ రోడ్డు నుంచి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డులో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేసారు.

పవన్ స్వయంగా ఇసుక..సిమెంట్ తీసుకొచ్చి
స్వయంగా సిమెంట్..ఇసుకను తీసుకొచ్చి గుంతలు పూడ్చేందుకు ప్రయత్నించారు. అక్టోబర్ రెండున సైతం ఏపీలో రహదారుల మరమ్మత్తు ల కోసం జనసేనాని శ్రమదానం నిర్వహించారు. అప్పటికే జనసేన సేవ్ ఏపీ రోడ్స్ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. గాంధీ జయంతి నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో..అదే విధంగా అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ శ్రమదానంలో పాల్గొన్నారు. రోడ్లు కూడా బాగుచేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని..దీని కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయంటూ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేసారు.

పార్టీ నేతలతో కలిసి శ్రమదానం చేస్తూ
తాజాగా ఏపీ ప్రభుత్వం రూ 2,200 కోట్లతో రోడ్ల మరమ్మత్తులకు నిర్ణయం తీసుకుంది. అయితే, జాతీయ రహదారికి పక్కన..అమరావతి పరిధిలో ఉన్న వడ్డేశ్వరం వద్ద ఆర్ అండ్ బీ రోడ్డు గుంతలు పడటంతో...పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో కలిసి శ్రమదానం నిర్వహించారు. ఇప్పుడు పవన్ శ్రమదానం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక, పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్...దీక్షకు ముందుగా తమిళనాడులో జరిగిన ఆర్మీ చాపర్ ప్రమాదంలో మరణించిన రక్షణ శాఖ సిబ్బందికి నివాళి అర్పించారు.

విశాఖ ప్లాంట్ కోసం దీక్ష
ఈ సాయంత్రం వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంఘీభావంగా దీక్షను కొనసాగించనున్నారు. ఏపీ ప్రభుత్వానికి గతంలో పవన్ కళ్యాణ్ వారం రోజుల సమయం నిర్దేశిస్తూ..ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్ పరిరక్షణ కోసం పార్టీల నేతలు..సంఘాల నాయకులను కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేసారు. కానీ, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో..పవన్ ఈ రోజు దీక్ష చేపడుతున్నారు. ఇక, ఈ సమయంలో పవన్ కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications