సోదరుడికి సీటు ఖరారు, తన పోటీ స్థానంపై పవన్ సంకేతాలు..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఈ రోజు నుంచి విశాఖలో పర్యటించనున్నారు. పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాల పైన ఇప్పటికే పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఉభయ గోదావరితో పాటుగా విశాఖలో పవన్ మెజార్టీ సీట్లు కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు పోటీ ఖాయమైంది. విశాఖ పర్యటన సమయంలోనే తనతో పాటు గా నాగబాబు స్థానం పైన స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
విశాఖ కేంద్రంగా
పవన్ కల్యాణ్ విశాఖలో విశాఖలో రెండు రోజులపాటు పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. నాగబాబు ఇప్పటికే అక్కడే ఒక ఇంటికి అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా మూడు ఎంపీ సీట్ల నుంచి జనసేన పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం స్థానాలను జనసేనకు కేటాయించారని సమాచారం. అందులో భాగంగా అనకాపల్లి నుంచి నాగబాబును బరిలోకి దించితే పార్లమెంట్ పరిధిలో కలిసి వస్తుందని పవన్ అంచనాగా కనిపిస్తోంది.

ఎంపీగా నాగబాబు పోటీ
2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరంతో పాటుగా గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. ఎక్కడ ఓటమి ఎదురైందో అక్కడే తిరిగి గెలిచి నిలబడాలనేది పవన్ ఆలోచనగా పార్టీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా భీమవరం నుంచి పవన్ పోటీ ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. అయితే, గాజువాక విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతున్నారు. నాగబాబు ఇక్కడ నుంచి ఎంపీగా చేయటం ద్వారా పవన్ అదే పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. పొత్తులు, రీజియర్ల వారీగా ప్రభావం చూపే అంశంలో రాయలసీమ నుంచి పవన్ రెండో స్థానంగా పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో రెండు స్థానాలు ప్రధానంగా చర్చలో ఉన్నాయి.
పవన్ కొత్త లెక్కలు
సీమ ప్రాంతంలో వైసీపీకి పట్టు కనిపిస్తోంది. దీంతో, పవన్ కు అండగా నిలుస్తారనే అభిప్రాయం ఉన్న ఒక మెజార్టీ వర్గాన్ని మొత్తంగా తన వైపు తిప్పుకోవాలంటే అక్కడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందు కోసం అనంతపురం అర్బన్ లేదా తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. బీజేపీతో పొత్తులు..సీట్ల పైన స్పష్టత వచ్చిన తరువాత తన పోటీ నియోజకవర్గం పైన పవన్ స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీకి పొత్తుల్లో తిరుపతి ఎంపీ స్థానం ఖాయమైతే..పవన్ తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఖాయమని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు ఉత్తరాంధ్రలో బలం చాటాలని భావిస్తున్న పవన్ విశాఖలో తన ఎన్నికల కార్యాచరణ వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications